Share News

మద్యం కల్తీ!

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:11 AM

నగరంలో కొందరు మద్యం వ్యాపారులు బరితెగించారు. అధిక లాభాల కోసం తమ దుకాణం/బార్‌లో విక్రయించే మద్యాన్ని కల్తీ చేసి మందుబాబులను మోసం చేస్తున్నారు.

మద్యం కల్తీ!

ఖరీదైన మద్యం సీసాలో 30 శాతం మేర తక్కువ ధర కలిగిన మద్యం కల్తీ

తక్కువ ధర మద్యంలో నీరు కలిపివేత

ఇటీవల రెండు మద్యం దుకాణాలు, ఒక బార్‌లో బయటపడిన బాగోతం

దాదాపు నగరమంతా ఇదే పరిస్థితి

ఎక్సైజ్‌ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తే మరిన్ని బయటకు...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కొందరు మద్యం వ్యాపారులు బరితెగించారు. అధిక లాభాల కోసం తమ దుకాణం/బార్‌లో విక్రయించే మద్యాన్ని కల్తీ చేసి మందుబాబులను మోసం చేస్తున్నారు. ఖరీదైన మద్యంలో తక్కువ ధర మద్యం కలపడం, తక్కువ ధర మద్యంలో ఏకంగా నీళ్లు కలపడం చేస్తున్నారు. ఇటీవల ఎక్సైజ్‌ శాఖ అధికారులు మూడు చోట్ల తనిఖీ చేయగా కల్తీ మద్యం బయటపడడంతో కేసులు నమోదుచేశారు. నగరంలో చాలా దుకాణాలు, బార్‌లలో కల్తీ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో 143 మద్యం దుకాణాలు, 102 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వాటికి అవసరమైన సరకును వ్యాపారులు ప్రభుత్వ డిపో నుంచి తెచ్చుకుంటారు. మద్యం విక్రయాలపై ప్రభుత్వం వ్యాపారులకు కొంత మార్జిన్‌ (లాభం) ఇస్తుంది. అయితే కొందరు వ్యాపారులు ప్రభుత్వం ఇచ్చే మార్జిన్‌ తమకు సరిపోవడం లేదని భావించి మోసాలకు పాల్పడడం మొదలుపెట్టారు. తమ దుకాణం లేదా బార్‌కు డిపో నుంచి వచ్చిన సరుకును గోడౌన్‌లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడ సిబ్బందిని పెట్టి ప్రత్యేక పరికరాలతో మద్యం సీసాల మూతలను తెరుస్తున్నారు. సీసాపై ఉండే లేబుల్‌గానీ, మూతతోపాటు అతికి ఉండే సీల్‌గానీ ఊడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖరీదైన మద్యం సీసాలో 30 శాతం నాసిరకం మద్యం నింపేస్తున్నారు. అలాగే నాసిరకం మద్యం సీసాల్లో 20 శాతం నీరుతో నింపేస్తున్నారు. తర్వాత మూతలను లేబుల్‌, సీల్‌తోపాటు యథావిధిగా అమర్చి దుకాణాలు/బార్‌లో విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి సీసాను ఎంత పరిశీలనగా చూసినప్పటికీ అనుమానం కలగడం లేదు. కొద్దిమంది మద్యం గాఢత విషయంలో తేడాను గుర్తించినప్పటికీ సీల్‌, లేబుల్‌ అంతా పక్కాగా ఉండడంతో తమ నోటికి అలా అనిపిస్తుందేమోననుకుని పట్టించుకోవడం లేదు. కొంతమంది మాత్రం తేడాను గుర్తించి కల్తీ చేశారేమోననే అనుమానంతో దుకాణం/బార్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే ‘మా దుకాణం/బార్‌లో అలాంటి సమస్యే ఉండదు. సీల్‌ను మీరే తెరిచారు కదా?’...అని ఎదురు ప్రశ్నిస్తుండడంతో మౌనంగా వెనుతిరుగుతున్నారు. ఇక సీసాల్లో తీసిన మద్యాన్ని వ్యాపారులు తమకు చెందిన బార్‌లకు తరలించి అక్కడ ఖాళీ అవుతున్న ఫుల్‌బాటిల్స్‌లో నింపుకుని, కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో మద్యం దుకాణాలు, బార్‌లలో కల్తీ విపరీతంగా పెరిగిపోయిందనే ఫిర్యాదులు అందుతుండడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఇటీవల కూర్మన్నపాలెంలో వాల్తేర్‌ వైన్స్‌తోపాటు వీరాంజనేయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. అక్కడ చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌లో 30 శాతం నీరు కలిపినట్టు, ఖరీదైన మద్యం క్వార్టర్‌ బాటిల్‌లో చీప్‌ లిక్కర్‌ కలిపినట్టు తేలింది. అలాగే హెచ్‌బీ కాలనీలోని ఒక మద్యందుకాణంలో తనిఖీ చేయగా అక్కడ కూడా కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. మూడు దుకాణాలపై కేసులు నమోదుచేసిన అధికారులు తదుపరి చర్యలకు ఉన్నతాధికారుల అనుమతి కోసం లేఖ రాసినట్టు తెలిసింది.

మద్యం కల్తీ కాకుండా ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తమ స్టేషన్‌ పరిధిలో ప్రతిరోజూ ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, ఒక మద్యం దుకాణం తనిఖీ చేయాలి. అక్కడికక్కడే ఎక్సైజ్‌ డైల్యూషన్‌ కిట్‌తో మద్యం శాంపిల్స్‌ను తనిఖీ చేసి కల్తీ జరిగిందేమోనని పరీక్షించాలి. ఇంకా అనుమానం ఉంటే మాధవధారలోని ప్రాంతీయ ఎక్సైజ్‌ల్యాబ్‌కు శాంపిల్స్‌ను పంపించాలి. కల్తీ జరిగినట్టు తేలితే ఆ మద్యం దుకాణం/బార్‌పై ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదుచేసి సీజ్‌ చేయాలి. కనీసం రూ.ఐదు లక్షలు జరిమానా విధించవచ్చు. అయితే నగరంలో ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్న కొందరు సీఐ స్థాయి అధికారులు కొంతకాలంగా తనిఖీల జోలికి వెళ్లకపోవడంతో మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా కల్తీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Sep 11 , 2026 | 01:11 AM