Share News

ఇంటర్‌ ఉత్తీర్ణులకూ అగ్రికల్చర్‌ డిప్లొమాలో ప్రవేశాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:20 PM

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం ప్రవేశాలు పొందేందుకు అర్హత కల్పిస్తూ ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్‌ ఉత్తీర్ణులకూ అగ్రికల్చర్‌ డిప్లొమాలో ప్రవేశాలు
చింతపల్లి ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

ఉత్తర్వులు జారీ చేసిన ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ వర్సిటీ

ప్రతి ఏటా జాబ్‌మేళా నిర్వహణకు ప్రణాళిక

చింతపల్లి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం ప్రవేశాలు పొందేందుకు అర్హత కల్పిస్తూ ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే నూతన విధానాన్ని అమలుపరుస్తూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కేవలం టెన్త్‌లో ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మాత్రమే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేవారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతి ఏడాది ఉద్యోగ మేళాను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలో అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సును అభ్యసించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థుల నుంచి పోటీ పెరిగింది. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సైతం అగ్రికల్చర్‌ డిప్లొమాలో చేరుతున్నారు. కొంత కాలంగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు సైతం అగ్రికల్చర్‌ డిప్లొమాలో చేరేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 22న జరిగిన విశ్వవిద్యాలయం అధికారుల సమావేశంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అగ్రికల్చర్‌ డిప్లొమాలో ప్రవేశాలు కల్పించాలని చర్చించారు. ఉన్నతాధికారులు ఏకాభిప్రాయంతో వ్యవసాయ నేపథ్యం కలిగి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులకు డిప్లొమాలో ప్రవేశాలు కల్పించాలని తీర్మానించారు. రెండు రోజుల క్రితం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌.. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు సైతం అగ్రికల్చర్‌ డిప్లొమాలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఉత్తర్వులు జారీచేశారు. అలాగే అగ్రికల్చర్‌ డిప్లొమా ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జూన్‌ 22వ తేదీ వరకు పొడిగించారు.

Updated Date - Jun 04 , 2026 | 11:20 PM