Share News

కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ల సర్దుబాటు

ABN , Publish Date - May 05 , 2026 | 12:43 AM

కొత్తజిల్లాల ప్రాతిపదికన, గత విద్యా సంవత్సరం విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఈసారి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు.

కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ల సర్దుబాటు

  • గత ఏడాది విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకోవాలని విద్యా శాఖ మార్గదర్శకాలు

  • అధికారులు కసరత్తు

  • ఉపాధ్యాయుల్లో చర్చ

  • జూలై నెలాఖరు, ఆగస్టు తొలివారంలో పిల్లల సంఖ్యను పరిగణన తీసుకోవాలని డిమాండ్‌

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

కొత్తజిల్లాల ప్రాతిపదికన, గత విద్యా సంవత్సరం విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఈసారి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ముగిసిన విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకుని ఈ ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.

జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, జీవీఎంసీ, ఎయిడెడ్‌ యాజమాన్యాల కింద 584 ప్రాథమిక/యూపీ/ఉన్నత పాఠశాలలు ఉండగా 3,503 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 67 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో తొమ్మిది వేల మంది పదో తరగతి పరీక్షలు రాసి బయటకు వెళ్లారు. ఆ మేరకు ఒకటి, ఐదు తరగతుల్లో ప్రవేశాలు జరగాల్సి ఉంది. అయితే ముగిసిన విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు జరుగుతుంది. దీని ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు తెరిచే సమయానికి కొందరు టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులకు నచ్చచెప్పి పిల్లలను స్కూలులో చేర్పించిన తరువాత సర్దుబాటు పేరుతో మరోచోటకు పంపిస్తే సదరు టీచర్‌కు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు, ఆగస్టు తొలి వారంలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే అవసరం ఉన్న చోటకు తగినంతమంది టీచర్లను పంపవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై విద్యా శాఖ ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. గత ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేస్తే కొన్నిచోట్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, మరికొన్నిచోట్ల ఖాళీగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

2022 ఏప్రిల్‌లో కొత్తగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక డీఈవో కార్యాలయం ఏర్పాటుచేశారు. అయినా ఇంతవరకు పదోన్నతులు, బదిలీలు, చివరకు సర్దుబాటు కూడా ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం కొత్త జిల్లాలను ప్రాతిపదికగా చేసుకుని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.


పనితీరు మెరుగుపరచుకోండి

ముఖ్యమంత్రి సదస్సు సన్నద్ధత సమావేశంలో అధికారులకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశం

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు చేరువ చేయాలని, వారు సంతృప్తి చెందే విధంగా పనిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులకు సూచించారు. ఈనెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రితో జరగనున్న కలెక్టర్ల సదస్సు సన్నద్ధతపై సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు శాఖల వారీగా ప్రాధాన్యం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే సేవలపై ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌, ఐవీఆర్‌ఎస్‌, ఇతర మార్గాల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోందని, ప్రతి అధికారి తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కీలక పనితీరు సూచికల సాధనలో వ్యక్తిగత శ్రద్ధతో ఏ, ఏ ప్లస్‌ ర్యాంకులు పొందాలన్నారు. చేసిన పనిని సక్రమంగా డేటా ఎంట్రీ చేయాలన్నారు. పథకాల అమలులో ఏ కారణాలతో వెనుకబడుతున్నామో గుర్తించి, లోపాలను సరిదిద్దుకుని ప్రణాళికాబద్ధంగా సాగాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా నివేదికలు తయారుచేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


పీజీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న పలువురిని స్క్వాడ్‌ పట్టుకుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కాలేజీలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఐదుగురిని ప్రత్యేక స్క్వాడ్‌ పట్టుకుందని ఎగ్జామినేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ బి. మునిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం నిర్వహించిన లా పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన 12 మందిని పట్టుకున్నామన్నారు. వీరంతా ఏయూ క్యాంపస్‌, ఎల్‌బీ లా కాలేజీలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులని వివరించారు.

Updated Date - May 05 , 2026 | 12:43 AM