గోదావరి డెల్టాకు అదనపు నీరు విడుదల
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:58 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి ఆదివారం మరోసారి గోదావరి డెల్టాకు 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు సీలేరు కాంప్లెక్సు జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
డొంకరాయి నుంచి 3,700 క్యూసెక్కులు..
విద్యుదుత్పత్తి ద్వారా మరో 4,300 క్యూసెక్కులు..
మార్చి 31 వరకు నీటి విడుదల కొనసాగింపు
అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి
సీలేరు కాంప్లెక్సు జెన్‌కో ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్
సీలేరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి ఆదివారం మరోసారి గోదావరి డెల్టాకు 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు సీలేరు కాంప్లెక్సు జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీరు సరిపడడం లేదని, అదనపు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు కోరడంతో ఆదివారం ఉదయం నుంచి డొంకరాయి జలాశయం మెయిన్ డ్యాం నుంచి ఆరు, ఏడు గేట్లు ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం మరో 4,300 కూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు వెళుతుందన్నారు. సీలేరు నుంచి గోదావరి డెల్టాకు మొత్తంగా 8 వేల క్యూసెక్కులు నీరు విడుదల అవుతుందన్నారు. గోదావరి డెల్టా రబీ పంటలకు నీటి అవసరాల నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 51 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. విద్యుత్ డిమాండ్ కూడా పెరగడంతో సీలేరు కాంప్లెక్సులోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్ తెలిపారు.