సీలేరు- పాలగెడ్డ రహదారికి అదనంగా రూ.4 కోట్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:22 AM
పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల అంతర్రాష్ట్ర రహదారికి అదనంగా మరో రూ.4 కోట్లు మంజూరైందని ఆర్‌అండ్‌బీ పాడేరు ఈఈ ఎంఎల్‌వీ సాగర్ తెలిపారు.
డిసెంబరు నాటికి పనులు పూర్తి
ఆర్‌అండ్‌బీ ఈఈ ఎంఎల్‌వీ సాగర్
సీలేరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల అంతర్రాష్ట్ర రహదారికి అదనంగా మరో రూ.4 కోట్లు మంజూరైందని ఆర్‌అండ్‌బీ పాడేరు ఈఈ ఎంఎల్‌వీ సాగర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో సీలేరు నుంచి పాలగెడ్డ వరకు రూ.2 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులు సరిపడకపోవడంతో రూ.4 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 6న టెండర్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆర్వీనగర్- పాలగెడ్డ రహదారిలోని రీచ్ వన్‌లో ఆర్వీనగర్ నుంచి నూతిబంధ వరకు రూ.8 కోట్లతో రహదారి నిర్మాణం పూర్తి చేశామన్నారు. రీచ్- 2లో రెయిన్‌గేజ్ కింద నుంచి ధారాలమ్మ ఆలయం వరకు పనులు ప్రారంభించినప్పటికీ బిట్‌మేన్ కొరత కారణంగా పనులు నిలిచిపోయాయని, మరో వారం రోజుల్లో ఆ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల రహదారి పనులు డిసెంబరు నాటికి పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ కె.శ్రీనివాసరావు, జేఈ భరతుడు ఉన్నారు.
పనుల్లో జాప్యం ఎందుకు?..
బుధవారం సీలేరు వచ్చిన ఈఈ ఎంఎల్‌వీ సాగర్‌ను స్థానిక రాజకీయ నాయకులు కలిసి ఆర్వీనగర్- పాలగెడ్డ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈఈని కలిసిన వారిలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి చిటికెల రాము, టీడీపీ సీలేరు మాజీ అధ్యక్షుడు కె.సన్యాసిరావు, జనసేన నాయకుడు గోవింద్, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పాంగి దుర్జో, సీఐటీయూ నాయకుడు టి.విష్ణుకుమార్‌రాజు, తదితరులు ఉన్నారు.