Share News

కృష్ణాపురం పైనరీలో అదనపు హంగులు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:12 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం పైనరీలో అతిథులకు అదనపు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.70 లక్షలను విడుదల చేసింది. దీంతో వనవిహారి ఆవరణలో సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, ట్రెక్కింగ్‌ పాత్‌ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది పర్యాటక సీజన్‌ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

కృష్ణాపురం పైనరీలో అదనపు హంగులు
పర్యాటకుల కోసం నిర్మించిన సెమి పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌పార్కు

రూ.70 లక్షలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సెమి పర్మినెంట్‌ కాటేజీల నిర్మాణం

పర్యాటకుల చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌ క్రీడలు

చింతపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పర్యాటక సీజన్‌ (నవంబరు-మార్చి)లో ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి వచ్చిన పర్యాటకులు బస చేసేందుకు అనువుగా నిర్మించిన పైనరీని గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో కృష్ణాపురం వద్ద పైనరీని నిర్మించారు. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈమార్గంలోనే ప్రయాణించాలి. ఈ మార్గంలో ప్రయాణించే సందర్శకులు తోటల వద్ద ఆగి ఫొటోలు తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకొని వెళుతున్నారు. 2024లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.25లక్షలతో ప్రకృతి అందాలను ఆస్వాదించే అనువుగా పైనరీని రూపొందించారు.

అందుబాటులోనున్న సదుపాయాలు..

కృష్ణాపురం పైనరీలో పర్యాటకులు బస చేసేందుకు 15 సింగిల్‌ టెంట్లు, 10 డబుల్‌ టెండ్లు, క్యాంటీన్‌ ఏర్పాటుచేశారు. రన్నింగ్‌ వాటర్‌, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్‌ గేట్‌ పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటుచేశారు. పర్యాటకులు భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా ఉడ్‌ టేబుల్స్‌ను ఏర్పాటుచేశారు. లోపల, బయట ఆకర్షణీయమైన విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

రూ.70లక్షలతో అదనపు హంగులు

రాష్ట్ర ప్రభుత్వం పైనరీ అభివృద్ధికి రూ.70లక్షలు మంజూరు చేయడంతో అదనపు సదుపాయాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు చేపడుతున్నారు. ప్రధానంగా పర్యాటకుల విలాసవంతమైన బస (లగ్జరీ స్టే) కోసం కేరళాలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాక్షిక శాశ్వత(సెమీ పర్మినెంట్‌) కాటేజీలు మూడు నిర్మించారు. కాటేజీల నిర్మాణం 90 శాతం పూర్తిచేశారు. ఈ కాటేజీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌, లివింగ్‌ ఏరియా, డ్రస్సింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్‌, టాయిలెట్స్‌ ఉంటాయి. అలాగే చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకులు వాకింగ్‌ చేసేందుకు 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పాత్‌ ఏర్పాటు చేశారు. పైనరీలో పర్యాటకులకు ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. స్థానికులు వన భోజనాల కోసం కొంత విస్తీర్ణం కేటాయించారు. అలాగే ఓపెన్‌ విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం 24గంటలు టాస్క్‌ఫోర్సు ఉద్యోగులను నియమించారు.

నవంబరు నాటికి అందుబాటులోకి..

డీవీ నరసింహరావు, డీఎఫ్‌వో, చింతపల్లి

పర్యాటకులకు పైనరీలో అదనపు సదుపాయాలను నవంబరు నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం. సెమి పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, హాట్‌ బజార్‌ నిర్మాణాలు 90శాతం పూర్తి చేశాం. రెండు నెలల్లో శతశాతం పనులు పూర్తి చేస్తాం. పైనరీలో బస ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. పైనరీలో అరుదైన తుల్డా వెదురు నాట్లు వేస్తున్నాం.

Updated Date - Aug 07 , 2026 | 11:12 PM