అదనంగా బస్సులు
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:06 AM
నగరంలోని ప్రధాన మార్గాల్లో అవసరం మేరకు అదనపు ట్రిప్పులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది.
ప్రధాన రూట్‌లలో మరిన్ని ట్రిప్పులు
షెడ్యూల్ సర్వీసుల సామర్థ్యానికి మించి ప్రయాణికుల డిమాండ్ ఉన్నట్టయితేనే...
ఆర్టీసీ అధికారుల నిర్ణయం
ప్రతి డిపోలో ఉన్న స్పేర్ బస్సులు కూడా వినియోగం
ద్వారకా బస్‌స్టేషన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ప్రధాన మార్గాల్లో అవసరం మేరకు అదనపు ట్రిప్పులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. షెడ్యూల్ సర్వీసుల సామర్థ్యానికి మించి ప్రయాణికుల డిమాండ్ ఉన్నట్టయితే అదనపు ట్రిప్పులు నడుపుతోంది. ప్రధాన రూట్‌లలోని అన్ని బస్టాపుల్లోను ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు నిండుగా ఉన్నారని కొంతమంది డ్రైవర్లు బస్సులను స్టాప్‌లలో ఆపడం లేదు. కొంతమంది ఆపినా బస్సులోకి ఎక్కేందుకు కుస్తీ పట్టాల్సి వస్తోంది. ప్రధానంగా ద్వారకా బస్‌స్టేషన్ నుంచి గాజువాక, దువ్వాడ రైల్వేస్టేషన్, సింహాచలం నుంచి సింధియా, పాత పోస్టాఫీస్, ద్వారకా కాంప్లెక్స్, కూర్మన్నపాలెం నుంచి విజయనగరం, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అనకాపల్లి, పెందుర్తి, కొత్తవలస, భీమిలి, తగరపువలస ప్రాంతాలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటోంది. ఈ సమస్యలకు పరిష్కారం అదనపు ట్రిప్పులు నడపడమేనని అధికారులు గుర్తించారు. ప్రయోగాత్మకంగా శుక్రవారం 27 అదనపు ట్రిప్పులు నడిపారు. పాతపోస్టాఫీస్ నుంచి సింహాచలం 7, ద్వారకా కాంప్లెక్స్ నుంచి పెందుర్తి 4, అనకాపల్లి 3, శ్రీకాకుళం 4, దువ్వాడ రైల్వే స్టేషన్‌కు 3, మద్దిలపాలెం-కొత్తవలస 4, సింహాచలం నుంచి సింథియా 2 ట్రిప్పులు చొప్పున ఆపరేట్ చేసింది. అదనపు సర్వీసుల వల్ల ప్రయాణికులకు సత్వర రవాణా సేవలు అందించినట్టు ఆయా రూట్‌లలోని బస్టాపుల్లో గల కంట్రోలర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వాటితోపాటు శనివారం పాతగాజువాక నుంచి ఆర్కే బీచ్‌కు 2, ద్వారకా కాంప్లెక్స్ నుంచి పెదగంట్యాడ డెయిరీ కాలనీకి 1 అదనపు ట్రిప్పు నడిపారు. ఈ రూట్‌లలోని షెడ్యూల్ సర్వీసుల ఫ్రీక్వెన్సీ సమయాన్ని తగ్గించడం ద్వారా అదనపు ట్రిప్పులు ఆపరేట్ చేసే అవకాశం కలుగుతుంది. ఉదయం ఆరు గంటల కాకుండా బస్సులు డిపో నుంచి ఐదు గంటలకే బయలుదేరతాయి. అలాగే రాత్రి ఎనిమిది గంటలకు కాకుండా 9.00 గంటల వరకు తిరుగుతాయి. అదేవిధంగా షిఫ్ట్‌లు మారే సమయం గంటన్నర నుంచి అరగంటకు కుదించడం వంటి వాటి వల్ల ఈ అదనపు ట్రిప్పులు నడిపేందుకు వీలు కలుగుతుంది. అలాగే ప్రతి డిపోలో ఉన్న స్పేర్ సర్వీసులను కూడా అదనపు టిప్పులు నడిపేందుకు వినియోగించాలని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు మేనేజర్లకు సూచించారు. కొత్త బస్సులు వచ్చేంత వరకు ఇలా నడుపుతామని రీజనల్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో 710 బస్సులు ఉన్నాయి. అందులో 140 దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. మిగిలిన 570 బస్సులు జిల్లాలోని 145 రూట్లలో తిరుగుతున్నాయి. కొన్ని రూట్లలో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటుంది. ఆ రూట్లలో ఒక్కో షెడ్యూల్‌ను తగ్గించి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్‌లలో అదనపు సర్వీస్‌లు నడుపుతున్నారు.