బస్సులపై అదనపు భారం
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:03 AM
విశాఖ రీజియన్‌లో ‘స్త్రీశక్తి’ పథకం వర్తించే బస్సులు సామర్థ్యానికి మించిన బరువుతో నడుస్తున్నాయి.
స్త్రీశక్తి పథకం అమలు తరువాత 130 శాతం ఆక్యుపెన్సీ
50 సీటింగ్ ఉన్న బస్సులో 100 మంది ప్రయాణం
పరిమితికి మించి బరువు మోయాల్సి రావడంతో ఇంజన్‌ల నుంచి పొగలు
దెబ్బతింటున్న టైర్లు, క్లచ్ ప్లేట్లు
తగ్గిన కేఎంపీఎల్
పెరిగిపోతున్న నిర్వహణ వ్యయం
కొత్త బస్సులు రాకుంటే కష్టమే
ద్వారకా బస్‌స్టేషన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖ రీజియన్‌లో ‘స్త్రీశక్తి’ పథకం వర్తించే బస్సులు సామర్థ్యానికి మించిన బరువుతో నడుస్తున్నాయి. ఈ పరిస్థితి నెలల తరబడి కొనసాగడంతో ఇంజన్ కెపాసిటీ మరింతగా దిగజారిపోతున్నది. ఇంజన్ వేడెక్కిపోవడం, పొగలు రావడం జరుగుతుంది. పరిమితికి మించి భారం మోయాల్సి రావడంతో టైర్లు, స్ర్పింగ్‌లు, క్లచ్ ప్లేట్లు కూడా పాడవుతున్నాయి. ఇక నడవలేని స్థితికి చేరుకున్న బస్సులు గ్యారేజీలకు చేరుతున్నాయి. ఒక బస్సు గ్యారేజీకి చేరితే అది మోయాల్సిన భారం మిగిలిన బస్సులపై పడుతుంది.
కెపాసిటీకి మించిన బరువు
రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 480 ఉన్నాయి. 1.3 లక్షల మంది విద్యార్థులు, 30 వేల మంది దివ్యాంగులు, ఇతర ఉచిత పాస్‌హోల్డర్లు, సాధారణ ప్రయాణికులు, స్త్రీశక్తి పథకం మహిళలు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో సగటున 130 శాతం వరకు నమోదవుతుంది. ఒక్కోమారు 50 సీటింగ్ ఉన్న బస్సులో 100 మంది కూడా ప్రయాణిస్తున్నారు. బస్సులన్నీ కిక్కిరిసినట్టు ఉంటున్నాయి.
తగ్గిన కేఎంపీఎల్
కెపాసిటీకి మించిన ప్రయాణికులతో బస్సులు తిరగడం వల్ల కేఎంపీఎల్ (లీటర్ డీజిల్‌తో నడిచే కిలోమీటర్లు) తగ్గిపోతుందని ఆర్టీసీ మెకానికల్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. స్త్రీశక్తి పథకం అమలుకు ముందు ఈ ఐదు రకాల బస్సుల సగటు కేఎంపీఎల్ 4.72 ఉండేది. ఇప్పుడు 4.3 ఉన్నట్టు అధికారులు లెక్కలు కట్టారు. అధిక బరువును లాగేందుకు ఇంజన్లు ఎక్కువగా ఇంధనాన్ని తీసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. బస్సుల రన్నింగ్ కండిషన్ తగ్గిన కొలది కేఎంపీఎల్ తగ్గుతుందంటున్నారు.
పెరిగిన అదనపు వ్యయం
స్త్రీశక్తి పథకానికి సంబంధించిన ఐదు రకాల బస్సుల నిర్వాహణకు అదనపు వ్యయం అవుతోందని అధికారులు చెబుతున్నారు. కేఎంపీఎల్ తగ్గడం వల్ల రోజుకు 500 లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చు అవుతుందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. టైర్లు, క్లచ్ ప్లేట్లు, స్ర్పింగ్‌లు వాటి నిర్దేశిత సమయానికి ముందే మార్చుకోవలసిన పరిస్థితి వస్తున్నదన్నారు. బస్సుల సంఖ్య పెరిగేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగరానికి కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సులు త్వరగా అందుబాటులోకి వస్తే...ప్రస్తుత బస్సుల రన్నింగ్ కండిషన్ మెరుగుపడి, అదనపు నిర్వాహణ వ్యయం తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.