Share News

కృష్ణాపురం పైనరీలో అదనపు సొబగులు

ABN , Publish Date - May 03 , 2026 | 11:03 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి సమీపంలో గల కృష్ణాపురం పైనరీలో అతిథులను అదనపు సదుపాయాలను అటవీశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్నది.

కృష్ణాపురం పైనరీలో అదనపు సొబగులు
శరవేగంగా నిర్మిస్తున్న సెమీ పర్మినెంట్‌ కాటేజీలు

రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు

శరవేగంగా సెమీ పర్మినెంట్‌ కాటేజీల నిర్మాణం

15 రోజుల్లో అందుబాటులోకి..

ఏడాది పొడవునా సందర్శనకు అనువుగా అటవీశాఖ చర్యలు

చింతపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి సమీపంలో గల కృష్ణాపురం పైనరీలో అతిథులను అదనపు సదుపాయాలను అటవీశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్నది. పైనరీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల నిధులను విడుదల చేయడంతో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శించేందుకు అనువుగా అటవీశాఖ పైనరీని తీర్చిదిద్దుతున్నది.

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి గత ఎనిమిదేళ్లుగా పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక సీజన్‌(నవంబరు నుంచి మార్చి)లో లంబసింగికి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు ప్రకృతి ఒడిలో బస చేసేందుకు అనువుగా అటవీశాఖ కృష్ణాపురం పైన్‌ తోటల్లో పైనరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. లంబసింగికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారికి ఆనుకుని పైనరీ ఉంది. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. దీంతో పర్యాటకులు బస చేసేందుకు పైనరీ అత్యంత అనువుగా ఉంటుంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల నిధులతో పైనరీలో పర్యాటకులకు అవసరమైన కనీస సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకులు బస చేసేందుకు పైన్‌ తోటల మధ్యలో 15 సింగిల్‌ టెంట్లు, 10 డబుల్‌ టెంట్లు, క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. రన్నింగ్‌ వాటర్‌, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్‌ గేట్‌ పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాకింగ్‌ చేసేందుకు 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పాత్‌ ఏర్పాటు చేశారు. పర్యాటకులు భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా వుడ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆకర్షణీయమైన విద్యుత్‌ కాంతులతో పైనరీని అలంకరించారు.

శరవేగంగా సెమీ పర్మినెంట్‌ కాటేజీల నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం వనవిహారి అభివృద్ధికి ఈ ఏడాది రూ.70లక్షలు మంజూరు చేయడంతో అదనపు సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పర్యాటకులకు విలాసవంతమైన బస(లగ్జరీ స్టే) కోసం కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాక్షిక శాశ్వత(సెమీ పర్మినెంట్‌) కాటేజీలు నాలుగింటిని శరవేగంగా నిర్మిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కాటేజీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌, లివింగ్‌ ఏరియా, డ్రెస్సింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్‌, టాయిలెట్స్‌ వుంటాయి. అతిథుల కోసం కేఫ్‌టేరియా నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌(సాహస క్రీడలు), ట్రెక్కింగ్‌ పాత్‌ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పైనరీలో ఈ ప్రాంతవాసులు, మైదాన ప్రాంతీయులు విందు, వినోద కార్యక్రమాలను జరుపుకుంటున్నారు.

Updated Date - May 03 , 2026 | 11:03 PM