ఉలిక్కిపడిన ఆదర్శనగర్
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:36 AM
జనావాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార బాణసంచా గోదాములో పేలుడు సంభవించింది.
అనధికార బాణసంచా గోదాములో భారీ పేలుడు
ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ
రెండు, మూడు కిలోమీటర్ల దూరం వినిపించిన పేలుడు శబ్దం
దెబ్బతిన్న సమీపంలోని ఇళ్లు
ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
గోపాలపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
జనావాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార బాణసంచా గోదాములో పేలుడు సంభవించింది. దీంతో గోపాలపట్నం ప్రాంతంలోని ఆదర్శనగర్, చంద్రనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దాలు రెండు, మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గోపాలపట్నం ప్రాంతంలోని ఆదర్శనగర్ శ్మశానవాటిక సమీపంలో రెండు అంతస్థులు భవనంలోని పైఅంతస్థు ఒక పోర్షన్‌ను దామోదర శివకృష్ణకుమార్ అలియాస్ బాంబుల శివ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఇతను రెండు దశాబ్దాల నుంచి అనధికారికంగా బాణసంచా తయారీ, అమ్మకాలు నిర్వహిస్తున్నాడు. ఆదర్శనగర్‌లో అద్దెకు తీసుకున్న భవనంలో బాణసంచా నిల్వ చేశాడు. ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో బాణసంచా నిల్వ చేసిన పోర్షన్‌లో భారీ పేలుడు సంభవించి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతోపాటు పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో ఏం జరిగిందో తెలియక చుట్టుపక్కల ఇళ్లల్లోని వారు బయటకు వచ్చి పరుగులు తీశారు. కొద్దిసేపటికి తేరుకొని పేలుడు జరిగిన భవనం వద్దకు చేరుకుని, ఆ భవనంలో మిగిలిన పోర్షన్లలో నివసిస్తున్న వారిని బయటకు తీసువచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. వీరిలో కొంతమంది పొగపీల్చడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపుచేశారు.
కాగా బాణసంచా గోదాములో జరిగిన పేలుడు శబ్దం రెండు, మూడు కిలోమీటర్ల దూరం వినిపించింది. పేలుడు ధాటికి భవనం శకలాలు 50 అడుగుల దూరంలో పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ పేలుడు సంభవించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికు ఊపిరి పీల్చుకున్నారు. గోపాలపట్నం సీఐ లెంక సన్యాసినాయుడు, పోలీసులు బృందం సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బాణసంచాను నిల్వ చేసిన వ్యక్తి గురించి స్థానికులను విచారించారు. నిందితుడు దామోదర శివకృష్ణకుమార్ పరారీలో వున్నట్టు తెలుసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.