మంచినీటికి కటకట
ABN , Publish Date - May 10 , 2026 | 12:33 AM
నగరాన్ని తాగునీటి కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. రిజర్వాయర్లలో నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ సరఫరా మాత్రం సక్రమంగా జరగడం లేదు.
రైవాడ రిజర్వాయర్ నుంచి నగరానికి నిలిచిన సరఫరా?
దాంతో కొన్ని ప్రాంతాలకు కొళాయిల ద్వారా రోజు విడిచి రోజు...
మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా సమయం తగ్గింపు
టీఎస్‌ఆర్ రిజర్వాయర్ వద్ద ట్యాంకర్ల బారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరాన్ని తాగునీటి కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. రిజర్వాయర్లలో నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ సరఫరా మాత్రం సక్రమంగా జరగడం లేదు. రైవాడ రిజర్వాయర్ నుంచి నగరానికి నీటి రాక ఇటీవల నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. కొన్ని ప్రాంతాల్లో కొళాయిల ద్వారా నీరు సరిగాపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో కొద్దిసమయమే వస్తుండడంతో నగరవాసులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు టౌన్ సర్వీస్ రిజర్వాయర్ (టీఎస్‌ఆర్) వద్ద నీటి లభ్యత లేకపోవడంతో ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి.
ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి, బావులన్నీ ఎండిపోయాయి. మోటార్ల ద్వారా నీటిని తోడుకునే అవకాశం లేకపోవడంతో అంతా కొళాయి నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నగరానికి తాగునీరు అందించే రిజర్వాయర్లలో నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ ఓపెన్ కాలువలు ద్వారా సరఫరా అవుతుండడంతో ఎండ తీవ్రతకు కొంత ఆవిరైపోతోంది. నగరానికి వస్తున్న నీటి పరిమాణం తీగ్గిపోవడం, కొళాయి నీటిపై ఆధారపడేవారు పెరిగిపోవడంతో సమస్య మొదలైంది. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు కొళాయి నీటి సరఫరా రోజువిడిచిరోజు జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాలకు సరఫరా సమయం తగ్గిపోయింది. బోర్లు పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లు, గ్రూప్‌హౌస్‌లలో ఉండేవారు వాడుక అవసరాల కోసం కొద్దిరోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుని కాలం నెట్టుకొస్తున్నారు.
రైవాడ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో మరింత పెరిగిన కష్టాలు
రైవాడ రిజర్వాయర్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో నగరంలో నీటి కష్టాలు మరింత పెరిగిపోయాయి. నగరానికి ఏలేరు రిజర్వాయర్‌తో పాటు గోదావరి నుంచి ప్రతిరోజూ 41.32 ఎంజీడీలు, తాటిపూడి రిజర్వాయర్ నుంచి పది ఎంజీడీలు, రైవాడ నుంచి 13.28 ఎంజీడీలు, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీలు నీటి సరఫరా జరుగుతుంది. ఆ నీరంతా కణితి, నరవ, ద్వారకా నగర్‌లోని టీఎస్‌ఆర్ (టౌన్ సర్వీస్ రిజర్వాయర్) రిజర్వాయర్లకు చేరితే, అక్కడ శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అయితే రైవాడ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా గత రెండు రోజులుగా నిలిపోయింది. దాంతో టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌లో ట్యాంకర్లకు నీటిని ఇచ్చే పంప్‌సెట్లను ఆపేశారు. ఈ నేపథ్యంలో అపార్టుమెంట్‌లకు ట్యాంకర్లతో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. నగరంలో నీటి ఇబ్బందుల గురించి ఇంజనీరింగ్ విభాగంలోని ఒక అధికారి వద్ద ప్రస్తావించగా, రైవాడ కాలువ నిర్వహణ పనులు జరుగుతున్నందున సగం మాత్రమే సరఫరా జరుగుతోందన్నారు. మిగిలిన నీటిని ఇతర వనరుల నుంచి తీసుకుని ప్రజలకు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, నగరంలో చాలా ప్రాంతాల ప్రజలు నీటి కోసం ఇబ్బందిపడుతున్నారు.