Share News

చురుగ్గా అన్న క్యాంటీన్ల పనులు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:47 AM

చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ ఉగాది పర్వదినాన వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలికే పరిమితమైన ఐదు రూపాయల భోజనం, మరికొద్ది రోజుల్లో చోడవరం, మాడుగుల వాసులకు కూడా అందుబాటులోకి రానున్నది.

చురుగ్గా అన్న క్యాంటీన్ల పనులు
చోడవరంలో అన్న క్యాంటీన్‌

చోడవరం, మాడుగుల, ‘పేటల్లో ఉగాది రోజున ప్రారంభం

అందుబాటులోకి రానున్న రూ.5 భోజనం, అల్పాహారం

చోడవరం/ మాడుగుల రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ ఉగాది పర్వదినాన వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలికే పరిమితమైన ఐదు రూపాయల భోజనం, మరికొద్ది రోజుల్లో చోడవరం, మాడుగుల వాసులకు కూడా అందుబాటులోకి రానున్నది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం (తాత్కాలికంగా టెంట్‌ వేసి)లో టీడీపీ గతంలో అధికారంలో వున్నప్పుడే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిల్లో కేవంల ఐదు రూపాయలకే భోజనం/ అల్పాహారం పెట్టేవారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు అన్న క్యాంటీన్లను మూసివేశారు. అప్పటి ప్రభుత్వ తీరుపై పేద ప్రజలు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను మూసివేయవద్దని, మీకు నచ్చిన పేరు పెట్టుకొని కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని, అంతేకాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌ పలుమార్లు ప్రకటించారు. అన్నట్టుగానే 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. గత ఏడాది చోడవరం, మాడుగుల, పాయకరావుపేటల్లో క్యాంటీన్ల నిర్మాణం మొదలుపెట్టారు. ఒక్కో క్యాంటీన్‌కు రూ.65 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరుచేసింది. వాస్తవంగా ఈ ఏడాది సంక్రాంతినాటికి పనులు పూర్తిచేసి ప్రాంభించాలని భావించారు. అయితే పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగింది. పాయకరావుపేటలో క్యాంటీన్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చోడవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట, మాడుగులలో సంతకు సమీపంలో నిర్మిస్నుత్న అన్న క్యాంటీన్ల పనులు చివరి దశకు చేరాయి. మరో పది రోజుల్లో పనులన్నీ పూర్తిచేసి, ఉగాది రోజున మూడుచోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Updated Date - Mar 06 , 2026 | 12:47 AM