Share News

చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:00 AM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ఖరీఫ్‌లో 45 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంతవరకు 28,538 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు
. సబ్బవరం మండలం అంతకాపల్లి ఆర్‌ఎస్‌కేలో కొనుగోలు చేసిన ఽధాన్యాన్ని లారీలో మిల్లుకు తరలిస్తున్న దృశ్యం

24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ

ఖరీఫ్‌ దాన్యం సేకరణ లక్ష్యం 45 వేల టన్నులు

ఇంతవరకు 28,538 టన్నులు సేకరణ

ఎంఎస్‌పీ ప్రకారం విలువ రూ.68.17 కోట్లు

రైతుల ఖాతాల్లో రూ.59.25 కోట్లు

మిగిలిన వారికి కొనసాగుతున్న చెల్లింపుల ప్రక్రియ

సేకరణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని అధికారుల ధీమా

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ఖరీఫ్‌లో 45 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంతవరకు 28,538 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 54,645 హెక్టార్లలో వరి సాగు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నారు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు మొహం చాటేసినప్పటికీ.. ఆగస్టు నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసి, పంట చేతికొచ్చే సమయం వరకు వాతావరణం అనుకూలించింది. దీంతో 60 వేల టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా, రైతుల నుంచి 45 వేల టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 65 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. వీటిలో 60 కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించి ధాన్యం సేకరిస్తున్నారు. మిగిలిన ఐదు కేంద్రాలను ఒకటి, రెండు రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2,300, ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యం రూ.2,320 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీనాటికి 9,237 మంది రైతుల నుంచి 28,538.32 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఎంఎస్‌పీ ప్రకారం ఈ ధాన్యం విలువ రూ.68.17 కోట్లు. ఇందులో రూ.59.25 కోట్లు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 1,023 మంది రైతులకు సబంధించిన రూ.8.92 కోట్ల చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతున్నది. కొంతమంది రైతుల ఆధార్‌, ఫోన్‌ నంబర్లు... బ్యాంకు ఖాతాలకు సరిపోలకపోవడంతో డబ్బుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఒకటి, రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తున్నారు.

24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు

ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిర్ణీత సమయంలో ప్రారంభించడమే కాకుండా, ధాన్యం డబ్బులను 24 గంటల్లోనే ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడేలా ఏర్పాట్లు చేసింది. అధిక శాతం రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వస్తున్నారని, ఫలితంగా లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ జరుపుతామని పౌరసరఫరాల సంస్థ డీఎం జయంతి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగం పుంజుకుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని రైతులను కోరారు.

Updated Date - Jan 09 , 2026 | 01:00 AM