విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:19 PM
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. పాఠశాల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఐటీడీఏ పీవో శ్రీపూజ హెచ్చరిక
బంగారుమెట్ట పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్
ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. పాఠశాల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందుగా పాఠశాల తరగతి గదులకు వెళ్లి విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారికి అందుతున్న వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, చదువు గురించి ఆరా తీశారు. విద్యార్థినులకు పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదని, బోధన సక్రమంగా సాగడం లేదని ఆమె పరిశీలనలో తేలింది. విద్యా ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం, పాఠశాల నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన ఉపాధ్యాయులందరినీ తీవ్రంగా మందలించి బోధనలో అలసత్వం వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపాధ్యాయినిగా మారిన పీవో
పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో శ్రీపూజ కొంత సేపు విద్యార్థినులకు పాఠాలు బోధించారు. వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. బ్లాక్ బోర్డుపై గణిత లెక్కలు చేసి చూపించారు. సంక్లిష్టమైన అంశాలను కూడా విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో సులభంగా వివరించారు. పాఠాలు బోధించడంతో పాటు విద్యార్థినులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.