పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:14 PM
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ నిషాంతి హెచ్చరిక
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌లో 117 వినతులు స్వీకరణ
మండలాల్లో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని సూచన
పాడేరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమంలో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో విధిగా హాజరుకావాలని, అదేవిధంగా ప్రతి సోమవారం మండల స్థాయి అఽధికారులు పీజీఆర్‌ఎస్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈక్రమంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఎక్కడ పీజీఆర్‌ఎస్ జరిగినా గైర్హాజరైన వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి బుధవారం జిల్లాలో ఏదో మండలంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలన్నారు. ఏదైనా కారణాలతో పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాలేని అధికారులు ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్ కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిషాంతి సూచించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 117 వినతులను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ సంబంధ సమస్యలపై 55, విద్య, వైద్యం, తాగునీరు, ఇంజనీరింగ్ విభాగాలు, విద్యుత్, పౌరసరఫరాలకు సంబంధించి 62 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కె.భుజంగరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.