గిరిజనుల అభీష్టం మేరకే చర్యలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:12 PM
జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో గిరిజనుల అభీష్టం మేరకే జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని కలెక్టర్ టి.నిషాంతి స్పష్టం చేశారు.
కలెక్టర్ టి.నిషాంతి స్పష్టీకరణ
హైడ్రో ప్రాజెక్టులపై వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని హితవు
పాడేరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో గిరిజనుల అభీష్టం మేరకే జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని కలెక్టర్ టి.నిషాంతి స్పష్టం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గిరిజనుల ఆందోళన నేపథ్యంలో ఆమె వారితో సానుకూలంగా మాట్లాడారు. స్థానిక సమాజాల ప్రయోజనాలను, షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రత్యేక చట్టాలు, నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం తమ కార్యకలాపాలు చేపడుతుందన్నారు. సున్నితమైన ప్రదేశాల్లో సర్వేలు, దర్యాప్తులు, క్షేత్ర స్థాయి కార్యకలాపాలు చేపట్టాలని ప్రతిపాదించినప్పుడు ప్రజలకు ముందస్తు సమాచారం, తదితర అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. అలాగే హైడ్రో ప్రాజెక్టుకు సంబంధించిన వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కలెక్టర్ కోరారు. అలాగే నిరంతర సంప్రదింపులు, పారదర్శకంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో గిరిజనులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్‌డీవో భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.