విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:27 PM
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో డి.కృష్ణమూర్తినాయక్ హెచ్చరించారు.
డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్
పినకోట పీహెచ్‌సీలో విధులకు గైర్హాజరైన సిబ్బంది ఒకరోజు జీతం నిలుపుదల
అనంతగిరి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో డి.కృష్ణమూర్తినాయక్ హెచ్చరించారు. మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ కేంద్రంలో గల పీహెచ్‌సీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, విధులకు హాజరుకాని పారామెడికల్ ఆప్తాల్మిక్, మహిళా హెల్త్ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్‌కు ఒకరోజు జీతం నిలుపుదల చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై స్టాఫ్ నర్సును మందలించారు. పినకోట పీహెచ్‌సీ నుంచి చింతపల్లి పారామెడికల్ ఆప్తాల్మిక్, అలాగే రూడకోట వెళ్లిన స్టాఫ్ నర్స్ డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం ఆస్పత్రిలో ఏ విధంగా సేవలు అందుతున్నాయని రోగులను ఆయన అడిగితెలుసుకున్నారు. పీహెచ్‌సీని ఆనుకుని ఉన్న ప్రసవ నిరీక్షణ కేంద్రాలను సందర్శించి, గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. కాన్పు తరువాత 48 గంటలపాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో తల్లీబిడ్డ ఉండాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన తరువాతనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంతో బాలింతలను తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. కాన్పుకు సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందస్తుగా సుఖ ప్రసవాల కోసం బర్త్‌వెయిటింగ్ హాల్‌కు తరలించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని, రహదారి లేని గ్రామాల కారణంగా గర్భిణులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.