Share News

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:01 AM

విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గం అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న హోం మంత్రి అనిత

- గ్రామాల్లో ప్రజా భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు

- హోం మంత్రి వంగలపూడి అనిత

నక్కపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గం అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తున్నానని, అధికారులు అంకితభావంతో పనిచేయాలని, పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ తాగునీరందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల భద్రతకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామస్థాయిలో ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. హెల్మెట్లు లేకుండా బైక్‌లు నడిపేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నక్కపల్లి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను మోడల్‌ హైస్కూల్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించి సీనియర్‌ హెచ్‌ఎంలు, విద్యాశాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ వ్యూపాయింట్‌ను త్వరలో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు.

Updated Date - Sep 16 , 2026 | 01:01 AM