Share News

ఎల్‌నినో ఎదుర్కొనేందుకు కార్యాచరణ

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:07 PM

సూపర్‌ ఎల్‌నినో ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు.

ఎల్‌నినో ఎదుర్కొనేందుకు కార్యాచరణ
విలేకరులతో మాట్లాడుతున్న ఏడీఏ బీవీ తిరుమలరావు

ప్రత్యామ్నాయ పంటలపై అధ్యయనం

వరిలో స్వల్పకాలిక రకాలు సిఫారసు

ఏడీఏ బీవీ తిరుమలరావు

చింతపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): సూపర్‌ ఎల్‌నినో ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ప్రతి నెలా పడాల్సిన వర్షపాతంలో 25 శాతం తగ్గుతుందని వాతావరణ శాఖ చెబుతుందన్నారు. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం వరి పంటపై పడుతుందన్నారు. ఈ నేపఽథ్యంలో గిరిజన ప్రాంతంలో వర్షాల ఆధారంగా జూలై 15, జూలై 30, ఆగస్టు 15లో నాట్లు వేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. స్వల్పకాలిక రకాలను రైతులకు సిఫారసు చేస్తున్నామన్నారు. గిరిజన రైతులకు ఇప్పటికే వరి విత్తనాలు 90 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నామన్నారు. సేంద్రీయ పద్ధతిలో పంటల సాగు చేసేందుకు అనువుగా పచ్చిరొట్ట ఎరువులు జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర విత్తనాలు జిల్లా వ్యాప్తంగా 950 క్వింటాళ్లు పంపిణీ చేశామన్నారు. ఖరీఫ్‌లో 1.54 లక్షల ఎకరాల్లో పంటలు పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వరి 98.8 వేల ఎకరాలు, మొక్కజొన్న 5,980, సామ 6.155, రాగి(చోడి) 38 వేలు, వేరుశనగ 5.162, కంది 1,100 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు రాయితీపై వరి విత్తనాలు తొలివిడతగా 9,800 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రెండో విడతగా మూడు వేల క్వింటాళ్లు పంపిణీ చేస్తామన్నారు. రాగి 261, రాజ్‌మా తొలివిడతగా 4,913, రెండో విడతగా రెండువేల కింటాళ్లు పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంపొందించేందుకు ఎస్‌ఎంఏఎం పథకం ద్వారా జిల్లాలో రైతులకు రూ.ఆరు కోట్ల విలువైన యంత్రపరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు లాటరీ పద్ధతి ద్వారా పరికరాలు అందజేస్తామన్నారు. రైతులు సంప్రదాయ పద్ధతులను విడిచిపెట్టి వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చునన్నారు. రైతులు డీ-కృషి యాప్‌ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలతో పంటలను సాగు చేసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో వ్యవసాయాధికారులు టి. మధుసూదనరావు, గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 10:07 PM