అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:18 AM
జీవీఎంసీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ హెచ్చరించారు. అభివృద్ధి పనులు, కొత్తగా ప్రతిపాదించిన పనులపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జీవీఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో చేపడుతున్న పనులు, ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా కార్యాచరణ తయారుచేసుకుని అమలుచేయాలని సూచించారు.
జీవీఎంసీ ప్రత్యేక అధికారి,
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ హెచ్చరిక
జీవీఎంసీ పరిధిలో చేపట్టిన పనులపై సమీక్ష
సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం
రోడ్లు, డ్రైన్‌లు, పార్కులు, వీధిదీపాలు, తాగునీటి సదుపాయాలు,
విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ హెచ్చరించారు. అభివృద్ధి పనులు, కొత్తగా ప్రతిపాదించిన పనులపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జీవీఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో చేపడుతున్న పనులు, ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా కార్యాచరణ తయారుచేసుకుని అమలుచేయాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసిన, ఇంకా జరుగుతున్న, భవిష్యత్తులో చేపట్టబోయే పనులపై కమిషనర్ కేతన్‌గార్గ్‌ను ఆరా తీశారు. దీనిపై కమిషనర్ కేటగిరీల వారీగా పూర్తిచేసిన, ఇంకా పెండింగ్‌లో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్న పనులను ప్రత్యేక అధికారికి వివరించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, కూడళ్లు, డ్రైన్‌లు, పార్కులు, సెంటర్ మీడియన్లు, వీధిదీపాలు, స్మార్ట్ స్ర్టీట్ వెండింగ్ జోన్‌లు, వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లు, తాగునీటి సదుపాయాలు, సర్వీస్ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నవంబరులో జరిగే సీఐఐ సదస్సు నాటికి చేపట్టాల్సిన నగర సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కొన్ని పనులను నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తిచేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. తర్వాత నిర్వహించే సమీక్షా సమావేశానికి నగరంలో జరుగుతున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారులు హాజరుకావాలని స్పష్టంచేశారు.