ఇద్దరు ఎక్సైజ్ అధికారులపై చర్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:39 AM
నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలోని విశ్వనాథ బీచ్‌ఫ్రంట్ రిసార్ట్సులో ఈవెంట్ నిర్వహణకు అనుమతులు జారీచేసిన వ్యవహారంలో బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
రెండు వార్షిక ఇంక్రిమెంట్లు హోల్డ్‌లో ఉంచుతూ ఉత్తర్వులు
విశ్వనాథ బీచ్ ఫ్రంట్ రిసార్ట్సులో ఈవెంట్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా అనమతులు ఇచ్చారని అభియోగం
విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి):
నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలోని విశ్వనాథ బీచ్‌ఫ్రంట్ రిసార్ట్సులో ఈవెంట్ నిర్వహణకు అనుమతులు జారీచేసిన వ్యవహారంలో బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 ఏప్రిల్ 13న ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విశ్వనాథ బీచ్‌ఫ్రంట్ రిసార్టులో ఈవెంట్ నిర్వహణకు అప్పటి పెందుర్తి ఎక్సైజ్ సీఐగా ఉన్న కె.సూర్యకుమారి, అప్పటి గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన పి.సుబ్బారావు అనుమతి జారీచేశారు. అయితే ఆ పార్టీలో కొందరు డ్రగ్స్ వాడుతూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్రస్థాయిలో దుమారం రేపింది. దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అప్పటి కాకినాడ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహణకు అనుమతి జారీచేశారనే అభియోగాలు నిర్ధారణ కావడంతో వారిద్దరి వార్షిక ఇంక్రిమెంట్‌లను విత్‌హోల్డ్‌లో ఉంచాలని ఆదేశిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.