Share News

అక్రమ మైనింగ్‌లో మరొకరిపై వేటు

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:01 AM

రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలో ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి జరిగిన గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారంలో మరికొందరు అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్‌ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) మజ్జి శ్రీనివాస్‌ను ఈ శాఖ డైరెక్టర్‌ గురువారం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాంబిల్లి తహశీల్దారు పొట్నూరి సత్యనారాయణరావుపై సస్పెన్షన్‌ వేటు పడనున్నట్టు సమాచారం. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదంటూ ఆయనపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.

అక్రమ మైనింగ్‌లో మరొకరిపై వేటు
పంచదార్ల వద్ద గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రదేశం (ఫైల్‌ ఫొటో)

రాంబిల్లి తహశీల్దారు సస్పెన్షన్‌?

రెవెన్యూ, సర్వే, రవాణా అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం

అనకాపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలో ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి జరిగిన గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారంలో మరికొందరు అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్‌ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) మజ్జి శ్రీనివాస్‌ను ఈ శాఖ డైరెక్టర్‌ గురువారం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాంబిల్లి తహశీల్దారు పొట్నూరి సత్యనారాయణరావుపై సస్పెన్షన్‌ వేటు పడనున్నట్టు సమాచారం. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదంటూ ఆయనపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. అంతేకాక రెవెన్యూ, సర్వే, రవాణా శాఖల్లో కూడా కొంతమంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం వున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

పంచదార్ల పుణ్యక్షేత్రానికి అతి చేరువలో అనుమతికి మించి భారీ ఎత్తున యంత్రాలతో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంతో పంచధారల ఉనికికి ముప్పు వాటిల్లిందంటూ స్థానికులు ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి సర్వే, తనిఖీ పూర్తయ్యేంత వరకు గ్రావెల్‌ తవ్వకాలను నిలిపివేయాలని పక్షం రోజుల క్రితం ఆదేశాలు జారీచేసింది. సర్వే చేసిన అధికారులు..గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వని భూముల్లో కూడా తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. గనుల శాఖ నుంచి పొందిన అనుమతుల ప్రకారం మైనింగ్‌ లీజుదారులు 1,04,000 టన్నుల గ్రావెల్‌ మాత్రమే తవ్వకాలు జరపాలి. కానీ 2,02,903 టన్నుల గ్రావెల్‌ అదనంగా తవ్వినట్టు గుర్తించారు. ఇందుకు గనులు- భూగర్భ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ను ప్రధాన బాధ్యునిగా చేస్తూ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తదుపరి సంబంధిత శాఖలకు చెందిన మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులపై చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.

Updated Date - Aug 01 , 2026 | 01:01 AM