Share News

కాఫీకి బెర్రీబోరర్‌ సోకకుండా కార్యాచరణ

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:09 PM

జిల్లాలో కాఫీకి బెర్రీబోరర్‌ తెగులు సోకకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

కాఫీకి బెర్రీబోరర్‌ సోకకుండా కార్యాచరణ
అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

ముందస్తు చర్యగా ఎంపిక చేసిన 35 గ్రామాల్లో సర్వే చేపట్టాలని సూచన

పాడేరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాఫీకి బెర్రీబోరర్‌ తెగులు సోకకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కాఫీ, అనుబంధశాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో ఎంపిక చేసిన 35 గ్రామాల్లోని 2,500 ఎకరాల్లో కాఫీతోటలపై సమగ్ర సర్వే చేపట్టాలన్నారు. గిరిజన కాఫీ రైతులు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, తెగులు సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. కాఫీ తోటల సర్వేకు 50 బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతి బృందం రోజుకు 20 ఎకరాలు చొప్పున సర్వే చేయాలని ఆదేశించారు. అలాగే కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సర్వే పూర్తి కావాలని, సర్వే ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. డీఆర్‌డీఏ, వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి సేద్య విభాగం, కాఫీ బోర్డు, తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

ఉపాధి పనులపై సమీక్ష

జిల్లాలో వీబీ జీరామ్‌జీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ టి.నిషాంతి గురువారం సమీక్ష నిర్వహించారు. ఆయా పనులను గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పనులు పూర్తయిన తర్వాత సకాలంలో బిల్లులు సమర్పించాలని, పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. అలాగే ఆయా పనులు చేపడుతున్న క్రమంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, కాఫీ బోర్డు డీడీ మురళీధర్‌, కాఫీ ఏడీ అయంతి, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 11:09 PM