ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:08 AM
గిరిజన ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(ఏపీ పీసీసీఎఫ్), ఫారెస్టు ఫోర్సు హెడ్ డాక్టర్ పీవీ చలపతిరావు తెలిపారు.
ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల పునరుద్ధరణ
పది లక్షల మేలిజాతి మొక్కల నాట్లు
ఆదివాసీ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
ఏపీ పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు
చింతపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(ఏపీ పీసీసీఎఫ్), ఫారెస్టు ఫోర్సు హెడ్ డాక్టర్ పీవీ చలపతిరావు తెలిపారు. బుధవారం ఏపీ పీసీసీఎఫ్ చింతపల్లి మండలంలో పర్యటించారు. తొలుత చింతలూరు టింబర్ డిపోను తనిఖీ చేశారు. స్థానిక అటవీశాఖ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. గిరిజన ప్రాంతానికి సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు పీఆర్ అండ్ ఆర్‌డీ, పర్యాటకశాఖ, అటవీశాఖ సంయుక్తంగా హోం టూరిజం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే హోం టూరిజం నిర్వహించడం వల్ల పర్యాటకులు గిరిజన ప్రాంతంలో బస చేసేందుకు ఆసక్తి చూపుతారన్నారు. అలాగే మినుములూరు, మర్దగుడ, వంగసార, ఆర్‌వీనగర్ ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణాపురం పైనరీలో పర్యాటకుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంత యువతీ, యువకులు, ఆదివాసీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎకో టూరిజం ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నామన్నారు.
ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల పునరుద్ధరణ
గిరిజన ప్రాంతంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) కాఫీ తోటలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఏపీ పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.10 హెక్టారుల్లో ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలు ఉన్నాయన్నారు. ఈ తోటలు 1981-84 ప్రాంతంలో నాటిన మొక్కలు కావడంతో దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. కాఫీ మొక్క గరిష్ఠంగా 35 ఏళ్ల పాటు దిగుబడినిస్తుందన్నారు. కాపు తగ్గిన కావేరి మొక్కలను తొలగించి మేలిజాతి మొక్కలను తోటల్లో నాట్లు వేస్తున్నారన్నారు. కాఫీ తోటల పునరుద్ధరణ కోసం చంద్రగిరి, సెలక్షన్-5, 8, రొబస్ట్రా మేలిజాతి మొక్కల నర్సరీలను అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రతి ఏడాది పాత మొక్కలను తొలగించి కొత్త మొక్కల నాటుతూ తోటలను బలోపేతం చేస్తామన్నారు. అలాగే ఆర్‌వీనగర్, చింతపల్లి డివిజన్ల పరిధిలో 786 హెక్టార్ల కాఫీ తోటలు గిరిజనుల స్వాధీనంలో ఉన్నాయన్నారు. ఆదివాసీలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తోటలు పాడైపోతున్నాయన్నారు. ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ అధికారులు గిరిజనులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి తిరిగి సంస్థ నిర్వహణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాఫీ తోటల ద్వారా ఆదివాసీలకు ఉపాధి లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఆదివాసీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్‌డీసీ రీజనల్ మేనేజర్ బీఏవీ కృష్ణమూర్తి, చింతపల్లి, నర్సీపట్నం డివిజనల్ ఫారెస్టు అధికారులు వైవీ నరసింహరావు, శామ్యూల్, చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం ఏపీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్లు రన్నద్వీప, కృష్ణబాబు, జీఎస్‌వీ సత్యం, రేంజ్ అధికారులు బి.అప్పారావు, మణికృష్ణ పాల్గొన్నారు.