‘రాక్‌ట్రీ’పై యాక్షన్
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:49 AM
పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడంలో విఫలమైన రాక్‌ట్రీ ఏజెన్సీపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పేదల ఇళ్ల నిర్మాణం నుంచి అర్ధాంతరంగా వైదొలగిన సంస్థ
నాలుగు లేఅవుట్‌లో 11,193 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టిన నాటి వైసీపీ పాలకులు
ఒక ఇల్లు మాత్రమే పూర్తి
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపివేత
అప్పటికే వేర్వేరు రూపాల్లో రూ.70 కోట్లు చెల్లింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడంలో విఫలమైన రాక్‌ట్రీ ఏజెన్సీపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్ధాంతరంగా పనుల నుంచి వైదొలగిన సదరు సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని గృహ నిర్మాణ శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
నగరంలో గూడులేని పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఇందుకోసం శివారు ప్రాంతాల్లో 50 నుంచి 400 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 70 వరకు లేఅవుట్లు రూపొందించారు. వాటిల్లో సుమారు లక్ష ఇళ్లు (ఒక్కొక్క ఇల్లు సెంటు స్థలంలో) మంజూరుచేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద ఒక్కొక్క ఇంటికి రూ.1.5 లక్షలు మంజూరుచేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కేటాయించింది. ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యతను అప్పటి పాలకులు తమ అస్మదీయ సంస్థలకు అప్పగించారు. అందులో భాగంగా నాటి అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు కుటుంబానికి చెందిన రాక్‌ట్రీ ఏజెన్సీకి 40 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ సంస్థ సబ్బవరం మండలం పైడివాడఅగ్రహారంలో ఒక మోడల్ గృహం నిర్మించింది. ఆ తరువాత నిర్మాణంలో వెనకడుగు వేయడంతో అధికారులు...11,193 ఇళ్లు మాత్రమే నిర్మించాలని సూచించారు. పైడివాడ అగ్రహారంలో 4,732, నడుపూరులో 3,314, గంగవరంలో 1,693, నంగినారపాడులో 1,453 ఇళ్ల నిర్మాణం రాక్‌ట్రీ ఏజెన్సీ చేపట్టింది. తొలి నుంచి పనులు సరిగా చేయలేదు. పాలకుల దన్ను ఉండడంతో అధికారులు పదేపదే హెచ్చరించినా పట్టించుకునేది కాదు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో ఇళ్ల నిర్మాణం నుంచి తప్పుకుంది. మొత్తం 11,193 ఇళ్లలో ఒక ఇల్లు మాత్రమే (పైడివాడఅగ్రహారానికి మోడల్ ఇల్లు) పూర్తిచేసిన ఆ సంస్థ 10,500 ఇళ్లను పునాదుల్లోనే నిలిపివేసింది. మరో ఆరేడు వందల ఇళ్లను గోడలు, స్లాబ్, తదితర దశల వరకు నిర్మించింది. ఇందుకుగాను బిల్లుల రూపంలో రూ.35.68 కోట్లు, ఇనుము/సిమెంట్/ఇసుక రూపేణా రూ.34.44 కోట్లు వెరసి రూ.70.12 కోట్లు తీసుకుంది. ఇళ్ల నిర్మాణం నిలిపివేయడంతో హౌసింగ్ అధికారులు నోటీసులు ఇవ్వగా, రాక్‌ట్రీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో కేటాయించిన ఇళ్లను పూర్తిచేయడంలో విఫలమైన సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం లబ్ధిదారులతో ఫిర్యాదు చేయించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి అవసరమైన వివరాలను లబ్ధిదారుల నుంచి సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాక్‌ట్రీ ఏజెన్సీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని హౌసింగ్ పీడీ సీహెచ్ సత్తిబాబు తెలిపారు.