Share News

పశుసంవర్ధక శాఖలో నకిలీ ఉద్యోగులపై చర్యలు?

ABN , Publish Date - May 30 , 2026 | 12:38 AM

పశుసంవర్ధక శాఖలో నకిలీ ఉద్యోగులపై చర్యలు?

పశుసంవర్ధక శాఖలో నకిలీ ఉద్యోగులపై చర్యలు?
అనకాపల్లిలో ప్రభుత్వ పశువైద్య కేంద్రం

జిల్లాలో 198 మందికి నోటీసులు జారీ చేసిన అధికారులు

వీరిలో 26 మంది తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ

మరింత లోతుగా విచారణ

నకిలీ పత్రాలని తేలితే డిస్మిస్‌తోపాటు క్రిమినల్‌ కేసులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నియమితులైనపశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకులు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్టు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. కొంతమంది బోగస్‌ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో పశుసంవర్ధక శాఖ సహాయకులందరి ధ్రువపత్రాలు పరిశీలించాలని ఇటీవల జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. జిల్లాలో 198 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా వీరిలో 26 మంది సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని ప్రాథమిక విచారణలో తేలడంతో వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పశువులు ఎక్కువగా ఉండే గ్రామాల పరిధిలో ఉన్న 371 సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకపోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో 198 పోస్టులు ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో వున్నాయి. ఈ పోస్టుకు రెండేళ్ల యానిమల్‌ అసిస్టెంట్‌ డిప్లొమా కోర్సు చదివిన అభ్యర్థులను అర్హులుగా పరిగణించారు. ఏపీతోపాటు ఇతర రాష్ర్టాల్లోని కళాశాలల్లో చదివిన వారు కూడా పరీక్షలు రాసి పశుసంవర్ధక శాఖ సహాయకులుగా ఎంపికయ్యారు. అప్పట్లో అభ్యర్థుల కొరత కారణంగా రాత పరీక్షలో ఒకటి, రెండు మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అయితే కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. వైసీపీ నేతల అండదండలతో సాగిన పశుసంవర్ధక శాఖ సహాయకుల అక్రమ నియామకాలపై అప్పట్లో కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచారణకు ఆదేశించింది. ప్రతి ఒక్కరి ధ్రువపత్రాన్ని వారు చదివిన కళాశాలకు పంపి నిర్ధారించుకోవాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించింది. దీంతో పశుసంవర్థక శాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జేడీ నీలయ్య అనకాపల్లి జిల్లాలో 198 మంది పశుసంవర్ధక శాఖ సహాయకులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్టు తెలిసింది. వీరిలో 26 మంది సమర్పించిన ధ్రువపత్రాల్లో వివరాలు సరిపోలకపోవడంతో లోతైన విచారణ చేపడుతున్నట్టు తెలిసింది. తప్పుడు ధ్రవపత్రాలతో ఉద్యోగాలు పొందినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 12:38 AM