Share News

ఏయూ అనుబంధ కళాశాలలపై చర్యలు?

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:22 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు అనుబంధ కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

ఏయూ అనుబంధ కళాశాలలపై చర్యలు?

ఇటీవల అనేక కాలేజీలను తనిఖీ చేసిన ఎఫిలియేషన్‌ కమిటీలు

కొన్నిచోట్ల లోపాల గుర్తింపు, చర్యలకు సిఫారసు

జాబితాలో పలు డిగ్రీ, పీజీ, లా, బీఈడీ కాలేజీలు

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు అనుబంధ కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం. ఇటీవల ఏయూ అధికారులు నియమించిన ఎఫిలియేషన్‌ కమిటీ సభ్యులు అనుబంధ కాలేజీల్లో తనిఖీలు చేశారు. అనేక చోట్ల లోపాలను గుర్తించి కొన్ని కాలేజీలపై చర్యలకు సిఫారసు చేసినట్టు తెలిసింది.

ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లో 190కు పైగా డిగ్రీ, మరో 70 పీజీ, 60 వరకు బీఈడీ, లా కాలేజీలున్నాయి. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, భవనాలు, వంటి అనేక అంశాలను పరిశీలించేందుకు వర్సిటీ అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలు ఆయా కాలేజీలను పరిశీలించాయి. కొన్ని కాలేజీల్లో లోపాలను గుర్తించి, వాటికి ఎఫిలియేషన్‌ ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని నివేదిక సమర్పించినట్టు తెలిసింది. గతంలోనే లోపాలను గుర్తించి సరిచేసుకోవాలని సూచించినా కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడాన్ని కమిటీ సభ్యులు సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ జాబితాలో పది కాలేజీలున్నాయని, వాటిలో లా, బీఈడీ, డిగ్రీ కాలేజీలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిపై రెండు, మూడు రోజుల్లో వర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిసింది.

బీఈడీ కాలేజీల్లో ఇష్టారాజ్యం..

ఏయూ పరిధిలోని అనేక బీఈడీ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు తరగతులకు రాకున్నా ఫీజులు వసూలు చేసి మేనేజ్‌ చేస్తున్నాయి. వాటిపై సీరియస్‌గా దృష్టిసారించాలని భావిస్తున్నారు. గతంలో వీసీ స్వయంగా ఓ కాలేజీని తనిఖీ చేయగా అనేకలోపాలు బయటపడ్డాయి. దీంతో తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన వెంటనే ప్రత్యేకంగా బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేపట్టేందుకు ఏయూ అధికారులు సన్నద్ధమవుతున్నారు.


డీలర్ల మెడపై కత్తి

మినీ మార్ట్‌ల ఏర్పాటుకు నిబంధనలు

గుజరాత్‌ కంపెనీకి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని పౌరసరఫరాల శాఖ ఆదేశం

డిపోల అలంకరణ, బ్యానర్‌, లైటింగ్‌, సరకుల రవాణా నిమిత్తమేనని వివరణ

అధికారుల ఒత్తిడిపై డీలర్ల అసహనం

గాజువాక/మహారాణిపేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

రేషన్‌ డీలర్ల ఆదాయం పెంచేందుకు వీలుగా నగరంలో 96 డిపోలను మినీమార్ట్‌లుగా మార్చుతున్నారు. డిపోను అందంగా అలంకరించడం, బ్యానర్‌, బోర్డుతో స్టాండ్‌ ఏర్పాటు, లైటింగ్‌తో పాటు మార్ట్‌కు బ్రాండింగ్‌ కల్పించడం, యాప్‌ రూపకల్పన, సరకుల రవాణా బాధ్యతలను గుజరాత్‌కు చెందిన ‘ఫ్రంటీర్‌ మార్కెట్స్‌’ సంస్థకు పౌరసరఫరాల శాఖ అప్పగించింది.

బ్రాండింగ్‌, యాప్‌ తయారీ, ప్రతినెలా సరకులు సరఫరాకు ప్రతి డీలరు ఈ సంస్థకు డిపాజిట్‌గా రూ.10వేలు చెల్లించాలని అధికారులు సూచించారు. పౌరసరఫరాల శాఖతో ఫ్రంటీర్‌ మార్కెట్స్‌ మధ్య ఒప్పందం మేరకు ప్రతినెల యాప్‌లో 24వ తేదీన డీలర్లు మార్ట్‌కు అవసరమైన సరుకులను ఆర్డర్‌ పెట్టుకుంటే 29న డెలివరీ చేస్తారని చెబుతున్నారు. డిపాజిట్‌ వెనక్కి ఇవ్వరు. ఇదిలావుండగా ఫ్రంటీర్‌ మార్కెట్స్‌’కు ముందుగా డిపాజిట్‌ కింద రూ.10వేలు చెల్లించాలని రేషన్‌ డీలర్లపై ఒత్తిడి తీసుకురావడం దుమారం రేపుతోంది. డిపో అలంకరణ, పెయింటింగ్‌, బ్యానర్‌ తాము ఏర్పాటు చేసుకోలగమని, కేవలం యాప్‌రూపకల్పన, బ్రాండింగ్‌కు రూ.10వేలు చెల్లించాలా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ట్రవ్యాప్తంగా డీలర్లందరికీ ఒకటే యాప్‌ ఉంటుందని, దానికి డబ్బు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. మార్ట్‌లో సరకు ఆర్డర్‌, రవాణా ఉచితమని అధికారులు చెప్పడంలో అర్థంలేదంటున్నారు. ప్రతి కంపెనీ ఉత్పత్తిచేసే సరకులను డిస్ట్రబ్యూటర్లు నగరంలోని అన్ని వీధుల్లో ఉన్న దుకాణాలకు వద్దకు వచ్చి ఆర్డర్‌ తీసుకుని సరఫరా చేస్తుంటారని, ఇదంతా ఉచితమేనని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా మార్ట్‌లకు ఏయే సరకులు సరఫరాచేస్తారో ఇంతవరకు చెప్పలేదంటున్నారు.

ఇదిలావుండగా గతంలో జీసీసీ ఉత్పత్తులను విక్రయించాలని ప్రతి డిపోకు మూడు నుంచి ఐదువేల విలువగల సరుకులు అందజేశారని, చివరకు ఆ సరకులు కార్డుదారులు కొనుగోలుచేయకపోవడంతో పారేశామని డీలర్లు వివరించారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్‌ వద్ద ప్రస్తావించగా పౌరసరఫరాలశాఖతో కుదిరిన ఒప్పందం మేరకు ‘ఫ్రంటీర్‌ మార్కెట్స్‌’ డిపాజిట్‌ కింద రూ. 10వేలు చెల్లించాలన్నారు. ప్రతి డిపో ముందు బ్యానర్‌ , లైటింగ్‌ ఏర్పాటు, ప్రతినెల ఉచితంగా సరకులు సరఫరా బాధ్యత ఈ సంస్థ తీసుకుంటుందన్నారు. డీలర్లకు ప్రతినెల ఆర్థికంగా కొంత వరకు మేలు జరుగుతుందని భావించిన నేపథ్యంలో మినీ మార్టుగా మార్చుతున్నామన్నారు. ఇప్పటివరకు నగరంలోని 96 డిపోలో 56 మంది డీలర్లు రూ.10వేలు చొప్పున చెల్లించారని తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 12:22 AM