Share News

పరిచయస్తుడే హంతకుడు

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:25 AM

ఆరిలోవ దుర్గానగర్‌ సెక్టార్‌-3లో ఈనెల 11న జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ విడినట్టు తెలిసింది. హంతకుడు మృతురాలికి తెలిసిన వ్యక్తేనని సమాచారం.

పరిచయస్తుడే హంతకుడు

ఆరిలోవ మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ

పోలీసుల అదుపులో నిందితుడు?

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

ఆరిలోవ దుర్గానగర్‌ సెక్టార్‌-3లో ఈనెల 11న జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ విడినట్టు తెలిసింది. హంతకుడు మృతురాలికి తెలిసిన వ్యక్తేనని సమాచారం. దుర్గానగర్‌లో చీటీలు నిర్వహించే కాపు లక్ష్మి(45)ని ఈనెల 11న గుర్తుతెలియని వ్యక్తి గొంతునులిమి హత్యచేసిన విషయం తెలిసిందే. ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారంతోపాటు ఇంట్లోని రూ.ఐదు లక్షలు కనిపించలేదని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొత్తు కోసం ఎవరో హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన ఇంట్లోని సీసీ కెమెరాతోపాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఉదయం 10.12 గంటల సమయంలో తలకుటోపీ, ముఖానికి మాస్క్‌ ధరించిన వ్యక్తి ఒకరు ఇంట్లోకి వెళ్లి, మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కివెళ్లిపోయినట్టు గుర్తించారు. అతనిపై అనుమానంతో పోలీసులు గాలించి ఎట్టకేలకు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రాంగ్‌కాల్‌ ద్వారా మృతురాలికి కొద్ది సంవత్సరాల కిందట పరిచయం అయినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తివివరాలను సీపీ శంఖబ్రతబాగ్చి ఆదివారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.


ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

రేపటి నుంచే ప్రారంభం

హాజరుకానున్న విద్యార్థులు 80,956

పరీక్షా కేంద్రాలు 85

సీసీ కెమెరాల ఏర్పాటు

మద్దిలపాలెం, పిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 85 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలకు 80,956 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు 40,158 మంది రాయనుండగా...వీరిలో 20,163 బాలురు, 19,995 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 40,798 మంది (20,465 బాలురు, 20,333 బాలికలు) రాయనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా జిల్లా ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 0891-2567561లో సంప్రతించవచ్చు.

సీసీ కెమెరాల పర్యవేక్షణ

జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 85 పరీక్షా కేంద్రాల్లో 1,350 గదులను పరీక్షలకు కేటాయించారు. ఆయా గదుల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీసీ కెమెరాల లైవ్‌ స్ర్టీమింగ్‌ ఉంటుంది. అంతేకాకుండా నాలుగు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, 4 సిట్టింగ్‌ స్క్వాడ్లు, ఆర్‌ఐవో, డీవీఈవో బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎలక్ర్టానిక్‌ పరికరాలు, ఫోన్లు తీసుకుని వెళ్లకూడదు. కేవలం చీఫ్‌ సూపరింటెండెంట్లకు మాత్రమే కీప్యాడ్‌ ఫోన్‌ అనుమతి ఉంటుంది. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించడమే కాకుండా, జిరాక్స్‌ దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకున్నారు.


స్టీల్‌ప్లాంటులో 67 మందికి వీఆర్‌ఎస్‌?

ఉక్కుటౌన్‌షిప్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు యజమాన్యం మూడో దశలో కేవలం 67 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. సుమారు 841 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 76 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన 765 మంది దరఖాస్తులను యాజమాన్యం పరిశీలనలోకి తీసుకుంది. వారిలో 67 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చినట్టు తెలిసింది. వీఆర్‌ఎస్‌కు ఎంపికైన ఉద్యోగులకు ఒక నెల ముందుగా నోటీసు ఇచ్చి ఉద్యోగ విరమణ చేయిస్తారు.

పన్ను చెల్లించని కంపెనీకి తాళం

గాజువాక, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

ఆస్తి పన్ను చెల్లించనందున శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్‌కు చెందిన గోడౌన్‌ను జీవీఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. సంస్థ సుమారు రూ.1.9 కోట్ల పన్ను బకాయి ఉండడంతో నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ వారు పన్ను చెల్లించకపోవటంతో శనివారం గోడౌన్‌ గేటుకు తాళం వేశారు. ఆర్‌వో రాంనారాయణ, ఆర్‌ఐలు శివ, రెడ్డి మోహన్‌లు సమక్షంలో సీజ్‌ చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 01:25 AM