బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:51 AM
బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం తీర్పు చెప్పింది.
కంచరపాలెం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం తీర్పు చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2022వ సంవత్సరంలో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదీ తెలిపిన వివరాల ప్రకారం... ఐదో తరగతి చదువుతున్న తన పదకొండేళ్ల కుమార్తెతో ఆమె ఇంటికి సమీపానున్న బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. దుస్తులపై రంగు నీళ్లు పడడంతో శుభ్రం చేసుకునేందుకు బాలిక ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి ఇంట్లో చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్బడ్డాడు. బాలిక సోదరుడు రావడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. జరిగిన విషయం బాలిక తన తల్లికి చెప్పగా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం పోక్సో న్యాయస్థానం జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.2 లక్షలు నష్టపరిహారంగా అందించాలని తీర్పులో పేర్కొన్నారు.
నేడు కేజీహెచ్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం తరువాత కేజీహెచ్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశం బుధవారం జరగనున్నది. ఆస్పత్రిలోని ఎథిక్స్ గ్యాలరీలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. చాలా రోజుల తరువాత హెచ్‌డీఎస్ సమావేశం జరుగుతుండడంతో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధానంగా 20 అంశాలతో అజెండాను సిద్ధంచేశారు. ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో కలెక్టర్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్‌తోపాటు కమిటీలోని సభ్యులు హాజరుకానున్నారు.
బొగ్గు వ్యాపారం పేరిట మోసం
సుమారు రూ.2 కోట్ల వసూళ్లు
ముగ్గురి అరెస్టు
సీతంపేట, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
బొగ్గు నిల్వ చేసి అమ్మితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి, రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన కేసులో ముగ్గురిని నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బొగ్గు నిల్వ చేసి పోర్టుకు విక్రయిస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ లాసన్స్‌బే కాలనీకి చెందిన విజయ మహేశ్వరరావు, అనిల్ మహేశ్వరి, నితేష్ మహేశ్వరిలు నగరంలోని కొంతమందిని నమ్మించారు. ఈ క్రమంలో వారిని అక్కయ్యపాలేనికి చెందిన ఎస్.యామిని సంప్రతించారు. లాభాలు వస్తాయని ఆశ చూపి ఆమె వద్ద నుంచి విజయ, అనల్, నితేష్ దఫదఫాలుగా సుమారు రూ.50 లక్షల వరకు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా వ్యాపారం, డబ్బు కానరాకపోవడంతో మోసపోయినట్టు యామిని గ్రహించి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే క్రమంలో అక్కయ్యపాలెం, గాజువాక, సాగర్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి మరో నలుగురు ఫిర్యాదు చేసినట్టు సీఐ చింతపల్లి రాజేశ్ తెలిపారు. వారి వద్ద సుమారు రూ.కోటిన్నర వసూలు చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ మహేశ్వరి, అనిల్ మహేశ్వరరావు, నితేష్ మహేశ్వరిలను మంగళవారం అరెస్టు చేసినట్టు సీఐ చింతపల్లి రాజేశ్‌తెలిపారు. మరికొంత మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు.