Share News

గంజాయి కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:05 AM

గంజాయి కేసులో ముద్దాయి మెరుగుమల్ల విజయసాయికి 9వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి హరినారాయణ పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

గంజాయి కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు
విలేకరుల సమావేశంలో ఎస్పీ అమిత్‌ బర్దార్‌

రూ. లక్ష జరిమానా

ఎస్పీ అమిత్‌ బర్దార్‌

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో ముద్దాయి మెరుగుమల్ల విజయసాయికి 9వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి హరినారాయణ పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారన్నారు. గత ఏడాది సెప్టెంబరు 15వ తేదీన నిందితులు 462 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా హుకుంపేట ఎస్‌హెచ్‌వో బృందం బర్మన్‌గూడ జంక్షన్‌ వద్ద పట్టుకొని రిమాండ్‌కు తరలించారన్నారు. ఈ కేసుపై కోర్టులో గత ఏడాది నవంబరు 6వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ వరకు విచారణ కొనసాగిందన్నారు. అనంతరం ఎన్‌డీపీఎస్‌ చట్టం సెక్షన్‌ 20(బి) ప్రకారం ఎ-1 విజయసాయికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారన్నారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చీపురుపల్లి సూర్యనారాయణ సమర్థవంతంగా వాదనలు వినిపించారన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ అన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినందించారు.

Updated Date - Apr 18 , 2026 | 12:05 AM