Share News

విద్యార్థి మృతికేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:34 AM

మండలంలోని ఏటికొప్పాక శివారులో నాటు తుపాకీ పేలి ఆడారి వెంకట కౌశిక్‌(12) అనే విద్యార్ధి మృతిచెందిన కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్టు పరవాడ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ బి.మోహన్‌రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

విద్యార్థి మృతికేసులో నిందితుడి అరెస్టు
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నాటు తుపాకులను చూపుతున్న ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌రావు

రెండు నాటు తుపాకులు స్వాధీనం

పరవాడ ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌రావు వెల్లడి

ఎలమంచిలి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏటికొప్పాక శివారులో నాటు తుపాకీ పేలి ఆడారి వెంకట కౌశిక్‌(12) అనే విద్యార్ధి మృతిచెందిన కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్టు పరవాడ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ బి.మోహన్‌రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ నెల 8వ తేదీ ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మధ్యాహ్నం గ్రామ శివారులోని వరహా నదిలో ఆనకట్ట వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన అనంతరం వీరిలో ఒక విద్యార్థి.. తమ ఇంటిలో రెండు నాటు తుపాకులు వున్నాయని, వాటిని చూపిస్తానని చెప్పడంతో అంతా కలిసి సమీపంలో వున్న అతని కమ్మల ఇంటికి వెళ్లారు. తన తండ్రి కశింకోట సూరిబాబు తుపాకులను ఎలా వాడతారో చూపిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది. పక్కనున్న ఆడారి వెంకట కౌశిక్‌కు తూటాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పిల్లలంతా భయంతో పారిపోయారు. ఈ సమయంలో అక్కడే వున్న సూరిబాబు భయపడి కౌశిక్‌ మృతదేహాన్ని ఇంటికి సమీపంలో ఉన్న తుప్పల్లో పడవేసి, తుపాకులతో సహా కుమారుడిని తీసుకొని పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐలు ఘటనా స్దలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కశింకోట సూరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మల్లవరం సమీపంలో పట్టుకొని అరెస్టు చేశారు. రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి గన్‌పౌడర్‌ సరఫరా చేసిన కశింకోటకు చెందిన ముత్యాల అప్పల రమణ, మరొకరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో సీఐ ధనుంజయరావు, రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:34 AM