పసిడి హారం చోరీ కేసులో నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:02 AM
మండలంలోని జడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ బ్యాగు నుంచి బంగారం గొలుసు చోరీ చేసిన వ్యక్తిని రెండు రోజుల్లోనే పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ జి.కోటేశ్వరరావు గురువారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.
సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా రెండు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు
రావికమతం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ బ్యాగు నుంచి బంగారం గొలుసు చోరీ చేసిన వ్యక్తిని రెండు రోజుల్లోనే పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ జి.కోటేశ్వరరావు గురువారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.
జడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన పైలా వెంకటలక్ష్మి సుమారు మూడు తులాల బంగారం హారాన్ని గతంలో నర్సీపట్నంలోని ఎస్‌ఐబీ శాఖలో తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు. ఈ నెల ఐదో తేదీన రుణ బకాయిలు చెల్లించి, హారాన్ని విడిపించారు. దీనిని పర్సులో పెట్టుకొని, హ్యాండ్ బ్యాగులో భద్రపరిచి సర్వీసు ఆటోలో ఇంటికి బయలుదేరారు. కొత్తకోటలో ఆటో దిగి హ్యాండ్‌బ్యాగు చూసుకోగా... కత్తిరించి వుంది. బంగారం హారం ఉంచిన పర్సు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ కోటేశ్వరావు ఆదేశాలతో ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్, పోలీసులు రంగంలోకి దిగారు. వెంకటలక్ష్మి బంగారు హారాన్ని విడిపించిన బ్యాంకు వద్ద నుంచి, కొత్తకోటలో ఆటో దిగే వరకు దారిలో పలుచోట్ల వున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వెంకటలక్ష్మి ప్రయాణిస్తున్న ఆటోలో పెదబొడ్డేపల్లి సెంటర్ వద్ద ఎక్కిన వ్యక్తి, కొద్ది దూరం వెళ్లిన తరువాత చెట్టుపల్లిలో దిగిపోయాడు. కొద్దిసేపటి తరువాత మరో వ్యక్తి బైక్‌తో వచ్చాడు. ఇద్దరూ కలిసి బైక్‌పై వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఫుటేజీల్లో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు తీగ లాగారు. ఈ బైక్ కె.కోటపాడుకు చెందిన వ్యక్తి పేరున వుండడంతో అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాహనం తనదేనని, అయితే మాడుగుల గ్రామానికి చెందిన తన బంధువు నాగళ్ల రవికుమార్ కొద్ది రోజుల కిందట సొంత పనుల కోసం తీసుకున్నాడని చెప్పాడు. అతను చెప్పిన వివరాలతో పోలీసులు మాడుగుల వెళ్లి రవికుమార్‌ను అదుపులోకి తీసుకొని బంగారం హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతని నుంచి రెండో వ్యక్తి వివరాలు తెలుసుకుని విజయనగరం జిల్లా ఎస్.కోట వెళ్లి అతనిని (మైనర్) కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ కొత్తకోట తీసుకువచ్చి విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేశారు. మైనర్‌ను జువెనైన్ హోంకు పంపుతామని సీఐ తెలిపారు.
బ్యాంకు వద్ద వెంకటలక్ష్మిపై నిఘా
పైలా వెంకటలక్ష్మి నర్సీపట్నంలో బ్యాంకులోకి వెళ్లినప్పటి నుంచే రవికుమార్ ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. ఆమె బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కిన తరువాత మరో మైనర్‌తో కలిసి బైక్‌పై అనుసరించి, కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆటోను ఓవర్ టేక్ చేసి, పెదబొడ్డేపల్లి జంక్షన్‌లో దిగిపోయాడు. కొద్దిసేపటి తరువాత అక్కడకు వచ్చిన వెంకటలక్ష్మి ప్రయాణిస్తున్న ఆటోలో ఎక్కాడు. ఆమె హ్యాండ్‌బ్యాగును కత్తిరించి, బంగారం హారం ఉన్న పర్సును తస్కరించాడు. తరువాత చెట్టుపల్లిలో ఆటో దిగి, మైనర్‌కు ఫోన్ చేశాడు. అతను బైక్ తీసుకురావడంతో ఇద్దరూ కలిసి దానిపై ఎక్కి వెళ్లిపోయారు.