Share News

జిల్లాలో పక్కాగా జనగణన

ABN , Publish Date - May 07 , 2026 | 12:05 AM

జనగణన- 2027లో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరినీ జనగణన పరిధిలో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

జిల్లాలో పక్కాగా జనగణన
కలెక్టర్‌ టి.నిషాంతి

గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): జనగణన- 2027లో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరినీ జనగణన పరిధిలో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్‌పీల సదస్సులో పాల్గొనేందుకు అమరావతి వెళ్లిన ఆమె బుధవారం అక్కడి నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జనగణనలో భాగంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అలాగే జనగణనపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, అందుకు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో దండోరాలు వేయడం, కళాజాత ప్రదర్శనలు, మినీ వాహనాల్లో మైకుల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా భావించి, పారదర్శకంగా చేపట్టాలన్నారు. జనగణనలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవని, నిబంధనల మేరకు గణన జరగాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రసాదరావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ప్రసాదరావు, డీపీఆర్‌వో కె.వెంకటరావు, తదితరులు పాల్గొనారు.

Updated Date - May 07 , 2026 | 12:05 AM