Share News

పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:15 AM

జిల్లాలో ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలే స్థానిక మేజర్‌ పంచాయతీకి రూ.1 కోటి 21 లక్షల 87 వేల 164 బకాయి ఉండడం గమనార్హం.

పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు
అత్యధిక ఆస్తి పన్ను బకాయి ఉన్న ఐటీడీఏ కార్యాలయం

పాడేరు పంచాయతీకి ప్రభుత్వ శాఖల నుంచి రావలసినది రూ.1.21 కోట్లు

అత్యధికంగా ఐటీడీఏ నుంచి రూ.25.74 లక్షలు

వైద్యశాఖ నుంచి రూ.20.92 లక్షలు

వివిధ శాఖల నుంచి రూ.లక్షల్లో...

నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ శాఖలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలే స్థానిక మేజర్‌ పంచాయతీకి రూ.1 కోటి 21 లక్షల 87 వేల 164 బకాయి ఉండడం గమనార్హం. ముఖ్యంగా గిరిజనాభివృద్ధికి పెద్ద దిక్కుగా ఉండే ఐటీడీఏ కార్యాలయం నుంచే అత్యధికంగా రూ.25 లక్షల 74 వేల 745ల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి సముదాయానికి సంబంధించి రూ.20 లక్షల 92 వేల 535 బకాయి ఉంది. ఇలా ప్రతీ ప్రభుత్వ శాఖ నుంచి రూ.లక్షల్లో బకాయిలు ఉన్నాయి.

వాస్తవానికి పంచాయతీ ఆర్థిక ప్రగతికి ఇంటి పన్నులే కీలకం. అయితే ప్రభుత్వ శాఖలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసే పాలకులు, ప్రభుత్వ శాఖల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనే భావన వ్యక్తమవుతున్నది.

ఆస్తి పన్నుల చె ల్లింపులకు సంబంధించి ప్రతి ఏడాది పంచాయతీ అధికారులకు ఆయా శాఖలు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో చేసేది లేక పంచాయతీ అధికారులు మిన్నకుండడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో ఇదే అదనుగా ఆస్తి పన్నుల చెల్లింపులపై ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య, పోలీస్‌ వంటి శాఖలు 1995 నుంచి ఇప్పటి వరకు పన్నులు చెల్లించకపోగా, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ శాఖలు, ఇంటర్‌మీడియట్‌ బోర్డు వంటి శాఖలు గత 25 ఏళ్లుగా పన్నులను చెల్లించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖాధికారులు మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన పన్ను బకాయిల వివరాలు

స్థానిక మేజర్‌ పంచాయతీకి వివిధ శాఖలు రూ.1 కోటి 21 లక్షల 87 వేల 164 బకాయి పడ్డాయి. అందులో అత్యధికంగా ఐటీడీఏ నుంచే రూ.25 లక్షల 74 వేల 745, ప్రభుత్వ ఆస్పత్రి రూ.20లక్షల 92 వేల 535, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం రూ.6,96,915, మండల రెవెన్యూ కార్యాలయం 6,51,780, డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీస్‌ రూ.3,33,218, జిల్లా మలేరియా కార్యాలయం రూ.18,544, పోలీసు శాఖ రూ.9,22,807, పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయం రూ.5,47,865, రోడ్లు, భవనాల శాఖ ఈఈ కార్యాలయం రూ.3,15,045, ఎక్సైజ్‌ సీఐ కార్యాలయం రూ.1,09,635, జీసీసీ డీఎం కార్యాలయం రూ.1,11,033, జీసీసీ బీఎం కార్యాలయం రూ.2,77,627, మత్స్యశాఖ ఏడీ కార్యాలయం రూ.22,158, గిరిజన సంక్షేమ ఈఈ కార్యాలయం రూ.1,82,214, గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ కార్యాలయం రూ.9,93,239, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ కార్యాలయం రూ.5,10,138, ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ సెంటర్‌ రూ. 2,30,989, ఎంపీడీవో కార్యాలయం రూ.5,16,703, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ రూ.12,030, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రూ.3,06,651, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కార్యాలయం రూ.1,23,826, డ్రైవర్ల సంఘం భవనం రూ.48,273 ప్రభుత్వ పశువైద్యశాల రూ.1,02,237, బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ కార్యాలయం రూ.1,0091, మోదకొండమ్మ ఆలయం రూ.1,29,334, శాఖా గ్రంఽథాలయం రూ.30,728, గిరిజన భవన్‌ రూ.52,402, ఉపాధి హామీ కార్యాలయం రూ.42,717.. ఇంకా పలు శాఖలు పన్ను బకాయిలున్నాయి.

పన్నుల చెల్లింపుల్లో ముందంజలో శాఖలు

స్థానిక మేజర్‌ పంచాయతీ పరిధిలో ఆస్తి పన్నులను క్రమం తప్పకుండా చెల్లించే ప్రభుత్వ శాఖలు ఉండడం అభినందనీయం. ఏపీఎస్‌ ఆర్‌టీసీ, అగ్నిమాపక శాఖ, ఆప్కో, వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం, పీఏసీఎస్‌ కార్యాలయం, డీసీసీబీ బ్యాంకు, నాల్గో తరగతి ఉద్యోగుల నివాస గృహాలు, టీడీపీ కల్యాణ మండపం, ఏపీ ఎన్జీవో సంఘ కార్యాలయం వంటివి ఇంటి పన్నుల చెల్లింపుల్లో ముందంజలో ఉన్నాయి. .

Updated Date - Jul 28 , 2026 | 12:15 AM