Share News

పేరుకుపోయిన జిప్సం నిల్వలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:47 AM

శ్రీహరిపురంలోని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎరువుల కర్మాగారంలో జిప్సం కొండలా పేరుకుపోయింది.

పేరుకుపోయిన జిప్సం నిల్వలు

కోరమాండల్‌ పరిశ్రమలో పరిస్థితి

25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 12 లక్షల టన్నుల నిల్వ

బయటకు తరలించాలని పీసీబీ అల్టిమేటం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

శ్రీహరిపురంలోని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎరువుల కర్మాగారంలో జిప్సం కొండలా పేరుకుపోయింది. అంచనా మేరకు కర్మాగారంలో సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో 10 నుంచి 12 లక్షల జిప్సం నిల్వలున్నాయి. నిబంధనల మేరకు ఎరువుల తయారీలో వచ్చిన జిప్సంను బయటకు తరలించాలి. అయితే యాజమాన్యంతరలింపులో నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రమండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య రెండురోజులక్రితం విశాఖ పర్యటనకు వచ్చినపుడు కర్మాగారాన్ని తనిఖీచేసి జిప్సం నిల్వలపై ఆరాతీశారు. కర్మాగారం ఆవరణలో ఉన్న జిప్సంను బయటకు తరలించాలని ఆదేశించారు.

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎరువుల కర్మాగారంలో ఫాస్ఫేట్‌ ఎరువుల తయారీ సమయంలో ఉప ఉత్పత్తి (బైప్రోడక్టు)గా జిప్సం(ఫాస్పోజిప్సం) ఉత్పత్తి అవుతుంది. అయితే జిప్సంను నిల్వచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఏటేటా పెరుగుతున్న జిప్సం కొండలా పేరుకుపోయింది. జిప్సం గుట్టలపై టార్పాలిన్లు కప్పడం సాధ్యంకావడంలేదు. అందువల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని పర్యావరణవేత్తలు చాలాకాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఏళ్ల తరబడి నిల్వ ఉన్న గుట్టలపై వర్షం పడినపుడు రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు కలుషితమవుతాయి. కొన్ని భార ఖనిజాలు విడుదలై భూమిలోకి ఇంకినపుడు భూగర్భజలాలు తాగేందుకు పనికిరావని పర్యావరణవేత్తలు స్పష్టంచేస్తున్నారు. గాలులు వీచినపుడు ఎండిన జిప్సం పొడి గాలిలో ఎగిరి దుమ్ముగా మారుతుంది. ప్రధానంగా పీఎం 10, పీఎం 2.5 పెరుగుతుంది. గాలి నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల శ్వాసకోశ, చర్మ సంబంధ సమస్యలు వస్తున్నాయి. కర్మాగారం పరిసరాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

అప్రమత్తం చేసినా...

గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జనవరిలో పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కర్మాగారం తనిఖీచేసి జిప్సం గుట్టల నిల్వలపై యాజమాన్యాన్ని అప్రమత్తంచేశారు. గాలిలో నాణ్యత తగ్గడానికి జిప్సమ్‌ కారణమని గుర్తించి నోటీసులు ఇచ్చారు. తాజాగా పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య తనిఖీచేసి జిప్సమ్‌ తరలించాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే జిప్సమ్‌ నిల్వలు పర్యావరణానికి ఇబ్బందిలేకుండా చూస్తామని యాజమాన్య ప్రతినిధులు వివరణ ఇచ్చారు. కర్మాగారంలో హెచ్‌డీపీఎఫ్‌ లైనింగ్‌ (సిమెంట్‌, ఇతర పదార్థాలతో కలిపి) చేసి దానిపైకి జిప్సం నిల్వలు తరలిస్తామని పేర్కొంది. దీనివల్ల భూగర్భజలాలు కలుషితం కాకుండా ఉంటాయని నివేదించింది. కాగా సిమెంట్‌ తయారీకి జిప్సం వినియోగిస్తున్నారు. ఇంకా రోడ్ల నిర్మాణానికి వాడుతుంటారు. జిప్సం తరలింపు కోసం జాతీయ రహదారుల విభాగం అధికారులతో కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తున్నారు. వారు అంగీకరిస్తే కోరమాండల్‌ కర్మాగారం నుంచి జిప్సం తరలుతుందని అంచనావేస్తున్నారు. అప్పటిలోగా బయటకు తరలించేందుకు అవసరమైన చర్యలుతీసుకోవాలని పీసీబీ స్పష్టంచేసింది.

Updated Date - Apr 06 , 2026 | 12:47 AM