Share News

తోడు దొంగలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:46 AM

జిల్లాలో అత్యధిక మండలాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాజకీయంగా ఉప్పు, నిప్పు అన్నట్టుగా వుంటారు.

తోడు దొంగలు

టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ప్రకృతి సంపద దోపిడీ

వెంకయ్యపాలెం కొత్తచెరువులో పెద్ద సంఖ్యలో చెట్లు నరికివేత

సా మిల్లులకు తరలింపు

పట్టించుకోని జనవనరుల శాఖ అధికారులు

మాకవరపాలెం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అత్యధిక మండలాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాజకీయంగా ఉప్పు, నిప్పు అన్నట్టుగా వుంటారు. కానీ మాకవరపాలెం మండలంలో మాత్రం కొంతమంది నాయకులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ ప్రకృతి వనరుల దోపిడీ విషయంలో ఏకతాటిపై నడుస్తుంటారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జా, నదులు, గెడ్డలు, చెరువులు, కొండవాలు ప్రదేశాల్లో ఇసుక, మట్టి గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, విక్రయాల్లో ఒక్కటై ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రభుత్వ భూముల్లో వృక్ష సంపదపై కన్నేశారు. చెరువులో ఏపుగా పెరిగిన చెట్లను నరికివేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మండలంలోని రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం గ్రామంలో 591 సర్వేనంబరులో సుమారు 10 ఎకరాల్లో కొత్తచెరువు ఉంది. సుమారు 40 ఏళ్ల క్రితం నాటిన నేరేడు, అకేసియా తదితర జాతుల చెట్లు సుమారు 200 వరకు వున్నాయి. వీటిపై స్థానిక టీడీపీ, వైసీపీ నాయకుల కన్నుపడింది. సుమారు 30 చెట్లను నరికివేయించి తామరం గ్రామంలో ఉన్న రెండు సామిల్లుకు తరలించి విక్రయించారు. చెరువులో ఇంకా 50 వరకు నేరేడు, వందకు పైగా అకేసియా చెట్లు వున్నాయి. చెరువులో వృక్షాలను నరికివేస్తున్నప్పటికీ సంబంధిత జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Updated Date - Mar 31 , 2026 | 01:46 AM