Share News

ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో ప్రమాదం

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:33 AM

లారీ ఢీకొని సూపర్‌వైజర్‌ మృతి చెందిన సంఘటన ఫార్మాసిటీలోని విష్ణు కెమికల్స్‌ ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో శనివారం చోటుచేసుకుంది.

ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో ప్రమాదం
మృతుడు నడుకూరి మదన్‌మోహనరావు (ఫైల్‌ ఫొటో)

లారీ ఢీకొని సూపర్‌వైజర్‌ దుర్మరణం

పరవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని సూపర్‌వైజర్‌ మృతి చెందిన సంఘటన ఫార్మాసిటీలోని విష్ణు కెమికల్స్‌ ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పరవాడ సీఐ ఎల్‌. భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని నడుపూరు గ్రామానికి చెందిన నడుకూరి మదన్‌మోహనరావు(52) కుటుంబ సభ్యులతో కలిసి అగనంపూడి సమీపంలోని డొంకాడ కాలనీలో నివాసముంటున్నారు. ఆయన విష్ణు కెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలో గత 19 ఏళ్లుగా జూనియర్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 5.50 గంటలకు విధులకు హాజరయ్యారు. కాగా ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో పార్థసారథి ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ పరిశ్రమలో రెసిడెయో (వోరో) (దీన్ని సిమెంట్‌ తయారీలో వినియోగిస్తారు) అనే వ్యర్థాలను తీసుకెళ్లేందుకు కంపెనీకి వచ్చింది. లోడు అనంతరం ప్రాంగణంలో గల వేబ్రిడ్జి వద్దకు వెళ్లి రివర్స్‌ చేస్తున్న క్రమంలో అక్కడ పర్యవేక్షిస్తున్న మదన్‌మోహనరావును వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆయన లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని యాజమాన్యం నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.మదన్‌మోహనరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు సందీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:33 AM