ఇన్నోవేర్ ల్యాబ్స్‌లో ప్రమాదం
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:49 AM
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ఎస్‌ఈజడ్‌లో వున్న ఇన్నోవేర్ ల్యాబ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒక కెమిస్టు మృతిచెందాడు. మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ సీహెచ్.నరసింగరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
అమ్మోనియా సిలిండర్ పేలడంతో కెమిస్టు మృతి
రాంబిల్లి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ఎస్‌ఈజడ్‌లో వున్న ఇన్నోవేర్ ల్యాబ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒక కెమిస్టు మృతిచెందాడు. మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ సీహెచ్.నరసింగరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామానికి చెందిన బొద్ద అజయ్‌కుమార్ (21) సుమారు రెండేళ్ల నుంచి అచ్యుతాపురం సెజ్‌లోని ఇన్నోవేర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కెమిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ‘సి’ షిఫ్ట్‌కు హాజరయ్యాడు. సుమారు 10.30 గంటల సమయంలో అమ్మోనియా గ్యాస్ సిలిండర్ పేలడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న అజయ్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. షిఫ్ట్ ఆపరేటర్ జె.పోతురాజుకు గాయాలయ్యాయి. ఇతనిని చికిత్స నిమిత్తం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ నరసింగరావు, పోలీసు సిబ్బందితో కంపెనీకి వెళ్లి పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించి, బుధవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా ఇన్నోవేర్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఉద్యోగి అజయ్‌కుమార్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని సీఐటీయూ నాయకులు ఆర్.రాము, జి.దేముడునాయుడు, కె.సోమునాయుడు డిమాండ్ చేశారు.