Share News

వార్డుల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణ

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:20 AM

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను అధికారులు 120 వార్డులు చేశారు. ఇప్పటికే ఒక విడత ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు.

వార్డుల పునర్విభజనపై  అభ్యంతరాల  స్వీకరణ

ప్రధాన కార్యాలయంతో పాటు

పది జోనల్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు

తొలిరోజు అందని అభ్యంతరాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను అధికారులు 120 వార్డులు చేశారు. ఇప్పటికే ఒక విడత ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. అయితే వార్డుల పునర్విభజనపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియను అడ్డుకోలేమని స్పష్టంచేస్తూ, మరోసారి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశాలతో వార్డుల పునర్విభజనపై మరోసారి అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని, శనివారం నుంచి 11వ తేదీ వరకు ప్రజలు తమ అభ్యంతరాలు, సలహాలను అందజేయవచ్చునని కమిషనర్‌ ప్రకటించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు వీలుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు పది జోనల్‌కార్యాలయాల్లోనూ ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. ఇద్దరు సిబ్బందిని, అందిన అభ్యంతరాలను నమోదు చేసేందుకు వీలుగా రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచారు. శనివారం ఒక అభ్యంతరం కూడా అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో కూడా అభ్యంతరాలు, సలహాలు అందజేసేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే వివరాలు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఈవీఎం యంత్రాలతో ఎన్నిక

మునిసిపల్‌ ఎన్నికలను ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ల (ఈవీఎం)తో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈవీఎంలను వాడాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ మున్సిపల్‌ యాక్ట్‌ 1965 ప్రకారం ఈవీఎంల వినియోగానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

Updated Date - Sep 06 , 2026 | 01:20 AM