Share News

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:30 AM

తీవ్ర వాయుగుండం, తదితర అంశాలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సమావేశాలతో అప్పటి వరకు హడావిడిగా ఉన్న స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం ఊహించని విధంగా జరిగిన ఏసీబీ దాడి కలకలం రేపింది.

కలెక్టరేట్‌లో ఏసీబీ కలకలం
కలెక్టర్‌ కార్యాలయం

బిల్లులు పాస్‌ చేసేందుకు రెవెన్యూ శాఖలో చిరుద్యోగి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఆర్‌వో

జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్‌లో ఏసీపీ దాడి జరగడం ఇదే తొలిసారి

రెవెన్యూ శాఖకు వచ్చినప్పటి నుంచి ఆయనది అవినీతి చరిత్రే..

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

తీవ్ర వాయుగుండం, తదితర అంశాలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సమావేశాలతో అప్పటి వరకు హడావిడిగా ఉన్న స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం ఊహించని విధంగా జరిగిన ఏసీబీ దాడి కలకలం రేపింది. సుమారు ఐదు వాహనాల్లో వచ్చిన ఏసీబీ అధికారులు కలెక్టరేట్‌ చుట్టూ మాటేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు చాంబర్‌లోకి వెళ్లారు. అప్పటికే రెవెన్యూ శాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌ చక్రవర్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుని తన వద్ద పెట్టుకున్న లోకేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్ఠుకున్నారు.

రెవెన్యూ శాఖలోకి వచ్చినప్పటికీ నుంచి అవినీతి ఆరోపణలే..

2005లో ఎక్సైజ్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందిన ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, తరువాత రెవెన్యూ శాఖలోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి. 2010 ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన లోకేశ్వరరావు 2017లో రెవెన్యూ శాఖలోకి డిప్యూటీ తహశీల్దార్‌గా క్యాస్టింగ్‌ అయ్యారు. దీంతో 2018లో తహశీల్దార్‌గా పదోన్నతి పొంది గాజువాక, పద్మనాభంలో పని చేసిన సమయంలో ఆయన భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వాటిపై నేటికీ శాఖాపరమైన విచారణలు జరుగుతున్నాయి. తరువాత 2023లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఒంగోలులో పని చేసిన ఆయన 2025 జనవరిలో పాడేరు ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. అనంతరం 2025 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు(మధ్యలో నాలుగు నెలలు ఆర్‌డీవోగా కూడా పని చేశారు) జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేస్తున్నారు. అయితే ఆయన రెవెన్యూ శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు కలెక్టర్‌ టి.నిషాంతికి కుడి భుజంగా ఉండడంతో ఆయన వ్యవహార శైలిపై కలెక్టర్‌కు తెలిపేందుకు ఎవరూ సాహసించలేదు. అలాగే ఆయన నిత్యం కలెక్టర్‌తోనూ ఉండి ఇతరులను ఆమెకు చేరువకాకుండా జాగ్రత్తపడేవారు. ఇదే అదనుగా ఆయన చెలరేగిపోవడంతో పాటు చిరుద్యోగి నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేసి ఏసీబీకి పట్టుబడడంతో కలెక్టరేట్‌లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే నూతన జిల్లా ఏర్పడిన తరువాత కలెక్టరేట్‌లో ఏసీబీ దాడి జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated Date - Sep 24 , 2026 | 12:30 AM