Share News

ఏసీబీ దాడులు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:30 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలోని మధురవాడ, పెందుర్తి, గాజువాక జోనల్‌ కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఏసీబీ దాడులు

జీవీఎంసీ మధురవాడ, పెందుర్తి, గాజువాక జోన్‌లలోని టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయాల్లో సోదాలు

అక్రమ నిర్మాణాలు, బీపీఎస్‌ ఫైళ్లు పరిశీలన

ఏసీపీలపై ప్రశ్నల వర్షం

కీలక సమాచారం సేకరణ

నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలోని మధురవాడ, పెందుర్తి, గాజువాక జోనల్‌ కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో మూడు బృందాలు మూడు జోనల్‌ కార్యాలయాలకు వెళ్లి టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని రికార్డులను పరిశీలించాయి. డీఎస్పీ రమణమూర్తి, సీఐ శ్రీనివాసరావు బృందం పెందుర్తి జోన్‌లో, సీఐలు సుప్రియ, తవిటినాయుడు బృందం గాజువాక జోనల్‌ కార్యాలయంలో, సీఐలు లక్ష్మణరావు, వెంకటరావు బృందం మధురవాడ జోనల్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోదాలు ప్రారంభించిన అధికారులు రాత్రి పది గంటల వరకు కొనసాగించారు.

మధురవాడ, గాజువాక, పెందుర్తి జోన్‌ల పరిధిలో పెద్దఎత్తున భవనాల నిర్మాణం జరుగుతోంది. వాటికి అనుమతులు, ఇత్యాది వ్యవహారాల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి, నిబంధనలను పాతరేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆధారాలతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల నుంచి ఇదే తరహా ఫిర్యాదులు ఏసీబీకి అందుతుండడంతో మంగళవారం ఆకస్మిక తనిఖీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. పెందుర్తి, గాజువాక, మధురవాడ జోన్‌లపై విజయవాడతోపాటు విశాఖలోని ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులు, వాటికి సంబంధించిన ఆధారాలతో వెళ్లి టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో ఉన్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిని కూర్చోబెట్టుకుని తమకు అందిన ఫిర్యాదులకు సంబంధించిన ఫైళ్లను తీసుకుని పరిశీలించారు. చాలాచోట్ల అక్రమ భవన నిర్మాణాలకు అఽధికారులు, సిబ్బంది అండదండలు అందజేస్తున్నారని, గత ఏడాది ఆగస్టు నాటికి పూర్తయిన భవన నిర్మాణాలకే బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన నిర్మాణాలను కూడా అందులో పెట్టి క్రమబద్ధీకరణకు సహకారం అందించారని గుర్తించినట్టు చెబుతున్నారు. అలాగే ఓపెన్‌స్పేస్‌ ఫీజులు వసూలు, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైళ్లలో అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. పెందుర్తిలో ఒక ఉద్యోగి వద్ద పది వేల రూపాయలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్‌లో ఏసీపీ షబ్నం శాస్త్రిని ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. షబ్నం శాస్త్రిపై కొందరు నేరుగా ఏసీబీ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు షబ్నంశాస్త్రి సమాధానం చెప్పలేకపోయారని టౌన్‌ప్లానింగ్‌ విభాగం సిబ్బంది కొందరు చెబుతున్నారు. రాత్రి పది గంటల వరకూ జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించిన అక్రమాలకు సంబంధించి మరింత సమాచారం కోసం బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా ఏసీబీ అధికారులు టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో సోదాలు చేస్తున్నారని తెలియడంతో మిగిలిన జోన్లలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితోపాటు ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఉలిక్కిపడ్డారు. అప్పటికప్పుడు తమ సీట్లనుంచి లేచి బయటకు వెళ్లడం కనిపించింది.

Updated Date - Mar 11 , 2026 | 12:30 AM