రెవెన్యూ అవినీతిపై ఏసీబీ డేగ కన్ను
ABN , Publish Date - May 29 , 2026 | 12:35 AM
జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నదనే విమర్శలు అధికం అవుతున్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో రెవెన్యూ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. స్వల్ప వ్యవధిలోనే అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.
లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదన్న ఆరోపణలు
భూ రికార్డుల్లో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు
ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంగా భారీగా అక్రమాలు
ప్రభుత్వ అనుమతి లేకుండా 22ఏ జాబితా నుంచి తొలగింపు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నదనే విమర్శలు అధికం అవుతున్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో రెవెన్యూ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. స్వల్ప వ్యవధిలోనే అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. దీంతో భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. ఇదే అదనుగా భావిస్తున్న రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అత్యధిక మండలాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూ రికార్డుల ట్యాంపరింగ్, 22ఏ జాబితాల్లో అక్రమ సవరణలు, అసైన్డ్ భూముల మార్పిడి, ఆన్‌లైన్ అడంగల్-1బీ రికార్డులలో మార్పులు వంటి వాటికి సంబంధించినవి అధికంగా వున్నట్టు తెలిసింది. లంచం సొమ్మును నేరుగా తీసుకోకుండా దళారుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, ఎలమంచిలి మండలాల్లో ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సమాచారం. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని గొలుగొండ, రోలుగుంట, నాతవరం మండలాల్లో రెవెన్యూ ఉద్యోగుల సాయంతో నకిలీ ధ్రువపత్రాలతో గిరిజనుల భూముల్లో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. దాదాపు అన్ని తహశీల్దారు కార్యాలయాల పరిధిలో అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌గా మార్చడం, భూ రికార్డుల్లో సవరణలు చేసి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం, మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాలు తీసుకొని పేర్లు తొలగించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నక్కపల్లి తహశీల్దారు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఒక వీఆర్‌ఓ ఏకంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని మండలాల్లో భూ యాజమానుల అనుమతి లేకుండానే వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో మార్పులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ఎలమంచిలి, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో 22ఏ జాబితా నుంచి భారీగా భూములను తొలగించినట్టు తెలిసింది. ఐదు ఎకరాల లోపు భూములు అయితే 22ఏ రికార్డు నుంచి తొలగించేందుకు ఆర్డీఓ, తహశీల్దారు క్షేత్ర పర్యటన నివేదికలు సరిపోతాయి. దీనిని అడ్డం పెట్టుకొని కొందరు పైస్థాయి రెవెన్యూ అధికారులు ఏకమై గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తూ, కాసులు దండుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల అనకాపల్లి పట్టణంలో దేవదాయ శాఖకు చెందిన ఒక భూమి విషయంలో ఆర్డీఓ స్థాయి అధికారి ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఎండార్స్‌మెంట్ జారీ చేశారు. తరువాత దీనిపై పలువురు ఫిరాదు చేయడంతో ఆ ఉత్తర్వులను రద్దు చేశారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజిఆర్‌ఎస్‌కు 350కిపైగా అర్జీలు అందితే, అందులో సగానికిపైగా అర్జీలు భూ సమస్యలు, వివాదాలకు సంబంధించినవే ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెంచిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో కూడా తనిఖీలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇటీవల 22ఏ భూముల వ్యవహారాలపై ప్రభుత్వం రీ-వెరిఫికేషన్ చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో గతంలో జరిగిన భూ లావాదేవీలు, ఫ్రిహోల్డ్ మార్పులు, సర్వే రికార్డుల సవరణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. అధికారికంగా ఫిర్యాదులు అందిన కేసులతోపాటు అనుమానాస్పద లావాదేవీలపై జిల్లా స్థాయిలో విచారణలు కూడా కొనసాగుతున్నాయని తెలిసింది. ముఖ్యంగా వెబ్‌ల్యాండ్, మీభూమి, రిజ్రిస్టేషన్ డేటా మధ్య వ్యత్యాసాలు ఉన్న కేసులను గుర్తించి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్టు సమాచారం.