Share News

భోగాపురానికి 8 ఏసీ బస్సులు

ABN , Publish Date - May 29 , 2026 | 12:32 AM

కూర్మన్నపాలెం డిపో నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ బస్సులు నడిపేందుకు అధికారులు గురువారం రూట్‌ సర్వే నిర్వహించారు.

భోగాపురానికి 8 ఏసీ బస్సులు

కూర్మన్నపాలెం నుంచి నడిపేందుకు అధికారుల రూట్‌ సర్వే

హైవేపై ఎంపిక చేసిన ప్రాంతాల్లో విమాన ప్రయాణికుల కోసం ఏసీ లాంజ్‌ల ఏర్పాటు

ద్వారకా బస్‌స్టేషన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి):

కూర్మన్నపాలెం డిపో నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ బస్సులు నడిపేందుకు అధికారులు గురువారం రూట్‌ సర్వే నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్‌ల ఆదేశాల మేరకు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, జీవీంఎంసీ సిటీ ప్లానర్‌ ధనుంజయరెడ్డి, జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధి రాజేష్‌ ఈ సర్వే చేశారు. జూలై రెండో వారంలో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో నగరం నుంచి విమాన ప్రయాణికుల రవాణాకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ఈ సర్వే నిర్వహించారు. కూర్మన్నపాలెం నుంచి భోగాపురం సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఏయే ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారో అంచనా వేసి, అక్కడకు దగ్గరలో జాతీయ రహదారిపై ఏసీ లాంజ్‌లు నిర్మించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా కూర్మన్నపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ, మద్దిలపాలెం, మధురవాడ, తగరపువలస ప్రాంతాలను ఎంపిక చేశారు.

విమాన ప్రయాణికుల కోసం విలాసవంతమైన సౌకర్యాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఏసీ బస్సులు జూన్‌ నెలాఖరులోగా నగరానికి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు వెల్లడించారు. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులని, వాటి కోసం భోగాపురం ఎయిర్‌పోర్టులోనే తాత్కాలిక చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. తొలుత ఎనిమిది బస్సులు నడిపి, ప్రయాణికుల డిమాండ్‌ ఉంటే రూట్లు, బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు.


గాలి,వాన

విరిగిపడిన చెట్ల కొమ్మలు

మహారాణిపేటలో 26.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. పిడుగులకు గాఢనిద్రలో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచారు. వాతావరణ అనిశ్చితితో తెల్లవారుజామున నాలుగు గంటల తరువాత నగరంపై భారీ మేఘాలు ఆవరించాయి. ఐదున్నర, ఆరు గంటల సమయంలో ఈదురుగాలులతో వర్షం మొదలైంది. అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా మహారాణిపేటలో 26.25, చావులుమదుము వద్ద 21.75, పరదేశిపాలెంలో 21, హెచ్‌బీ కాలనీలో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్దిరోజులుగా వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు ఈ వర్షంతో సేదతీరారు. తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఎండ తీవ్రత కాస్త తగ్గింది.


తెగ తాగుతున్నారు

భారీగా పెరిగిన బీర్‌ల అమ్మకాలు

గత ఏడాది ఇదే సీజన్‌తో పోల్చితే 46 శాతం అధికం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వేసవి కారణంగా జిల్లాలో బీర్‌లకు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాదితో పోల్చితే విక్రయాలు 46 శాతం వరకూ పెరిగాయి. జిల్లాలో 160 మద్యం దుకాణాలతోపాటు 96 బార్‌లు ఉన్నాయి. ఇవికాకుండా 18 స్టార్‌ హోటళ్లు, ఆరు క్లబ్‌లు, ఐదు ఏపీ టూరిజం బార్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు ఎక్కువగా ఉండడంతో బీర్‌ల విక్రయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. 2024 డిసెంబరు నుంచి 2025 మార్చి వరకు జిల్లావ్యాప్తంగా 4,89,698 బీర్‌ కేసులు అమ్ముడవ్వగా, ఏప్రిల్‌లో 1,90,517, మే నెలలో 1,30,876 కేసులు అమ్ముడయ్యాయి. మొత్తం డిసెంబరు నుంచి మే నెలాఖరు వరకు 8,11,091 బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి. అదే 2025 డిసెంబరు నుంచి 2026 మార్చి వరకు 7,15,966 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌ నెలలో 2,38,354, మే 25 నాటికి 1,70,565 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే 2025 డిసెంబరు నుంచి ఇప్పటివరకూ ఏకంగా 11,24,885 కేసులు అమ్ముడయ్యాయి. 2024 డిసెంబరు-2025 మే మధ్య విక్రయాలతో పోల్చితే 2025 డిసెంబరు-2026 మే మధ్య బీరు విక్రయాలు ఏకంగా 46 శాతం మేర పెరిగాయి.

Updated Date - May 29 , 2026 | 12:32 AM