కరువు తీరా వాన
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:20 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తీరందాటిన తరువాత కూడా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈదురు గాలులతో దఫదఫాలుగా వర్షం దంచికొట్టింది.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
36 గంటల్లో 90 మిల్లీమీటర్ల వర్షపాతం
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, గెడ్డలు
రిజర్వాయర్లు, చెరువులకు జలకళ
ఖరీఫ్ సాగుపై అన్నదాతల్లో చిగురించిన ఆశలు
వరినాట్లుకు సమయం మించడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏర్పాట్లు
ఈదురుగాలుకు పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం.. దెబ్బతిన్న రహదారులు
అనకాపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తీరందాటిన తరువాత కూడా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈదురు గాలులతో దఫదఫాలుగా వర్షం దంచికొట్టింది. వాగులు, గెడ్డలు, నదులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రైవాడ, కోనాం, పెద్దేరు, తాండవ, కల్యాణపులోవ, రావణాపల్లి జలాశయాలతోపాటు సాగునీటి చెరువుల్లోకి వరద నీరు చేరుతున్నది. కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ జిల్లాలో వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కిందిస్థాయి అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహించడంతో పంట కాలువలను తలపించాయి. వర్షాల కారణంగా కొన్నిచోట్ల రహదారులు దెబ్బతింటున్నాయి. రోడ్లపై ఏర్పడిన గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచడంతో చాలా మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పోలీసు, విద్యుత్తు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.
అనకాపల్లి పట్టణంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. ఆ తరువాత కూడా జల్లులు పడుతూనే వున్నాయి. డ్రైనేజీలు పొంగి వర్షం నీరు రహదారులపై ప్రవహించింది. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు బోసిపోయాయి. పరవాడ మండలంలో గెడ్డలు, వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగులు పారాయి. ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం మత్స్యకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు.
చోడవరం మండలంలో బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు 108 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. బుధవారం రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. వర్షం నీటితో పలు రహదారులు కాలువలను తలపించాయి. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా జల్లులు పడడంతో రోడ్లపై జనసంచారం తగ్గింది.
మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో పెద్దేరు నదిలో వరద ప్రవాహం పెరిగింది. వడ్డాది వద్ద తాత్కాలిక కల్వర్టు తూముల నిండుగా నీరు ప్రవహిస్తున్నది. దేవరాపల్లి మండలం అల్లుపురం వద్ద రోడ్డుకు అడ్డంగా చింత చెట్టు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ .సత్యనారాయణ వెళ్లి ఎక్స్‌వేటర్‌తో చెట్టును తొలగింపజేశారు. మాడుగులలోని పెదకోమటి వీధిలో దంగేటి రత్నవతికి చెందిన పెంకుటిల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కోటవురట్ల మండలంలో సర్పా, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. చెరువుల్లోకి నీరు చేరుతుండడంతో ఖరీఫ్ పంటల సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాయకరావుపేట మండలం గుంటపల్లి సమీపంలోని ఆవ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి.
ఎలమంచిలి పట్టణంలో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలోని చెరువుల్లోకి నీరు చేరడం, ఖరీఫ్ పంటకు వర్షం ఊపిరిపోయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు 146.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తహశీల్దార్ తెలిపారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం సబ్బవరం మండలంలోనే నమోదైనట్టు ఆయన వెల్లడించారు.
రావికమతం మండలం కల్యాణపులోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం ఒక అడుగు మేర పెరిగింది. గరిష్ఠ నీటి సామర్థ్యం 460 అడుగులుకాగా బుధవారం సాయంత్రం 438.05 అడుగులు వుంది. తరువాత భారీ వర్షం కురవడంతో గురువారం సాయంత్రానికి 439 అడుగులకు పెరిగింది.
బుధవారం రాత్రంతా భారీ వర్షం
జిల్లాలో బుధవారం రాత్రంతా దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 65.5 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సబ్బవరం మండలంలో 107.6 మి.మీ. వర్షం కురిసింది. మాడుగులలో 95 మి.మీ., పరవాడలో 72.2, కె.కోటపాడులో 88.2, అనకాపల్లిలో 68.2, దేవరాపల్లిలో 65.5, బుచ్చెయ్యపేటలో 79.2, చోడవరంలో 58.6, మునగపాకలో 62.4, కశింకోటలో 66.8, కోటవురట్లలో 55.6, నక్కపల్లిలో 58.2, గొలుగొండలో 56.4, నర్సీపట్నంలో 64.2, రావికమతంలో 65, చీడికాడలో 58.4, అచ్యుతాపురంలో 48.4, మాకవరపాలెంలో 62, రాంబిల్లిలో 54.2, రోలుగుంటలో 58.2 ఎలమంచిలిలో 55.2, పాయకరావుపేటలో 54.6, నాతవరంలో 52.4, ఎస్.రాయవరంలో 41.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కాగా గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జిల్లాలో 33.4 మి.మీ. సగటు వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా అచ్యుతాపురం మండలంలో 96.4 మి.మీ. వర్షం కురవగా, అత్యల్పంగా ఎస్.రాయవరం మండలంలో 13.2 మి.మీ వర్షం కురిసింది. నర్సీపట్నంలో 54.2 మి.మీ., మాకవరపాలెంలో 50.8, రోలుగుంటలో 50.6, కశింకోటలో 42.2, గొలుగొండలో 39.6, మునగపాకలో 37.2, సబ్బవరంలో 22, మాడుగులలో 27.8, పరవాడలో 36.8, అనకాపల్లిలో 36.6, రావికమతంలో 35.6, నాతవరంలో 33.6, చోడవరంలో 29.6, కె.కోటపాడులో 16.2, కోటవురట్లలో 28.2, నక్కపల్లిలో 25.6, ఎలమంచిలిలో 24.4, దేవరాపల్లిలో 22.4, బుచ్చెయ్యపేటలో 21.6, చీడికాడలో 18.2, రాంబిల్లిలో 19.6, పాయకరావుపేట మండలంలో 18.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు
రెండు, మూడు రోజుల క్రితం వరకు వరినాట్లు వేయక, కనీసం తడి కూడా లేని పంటపొలాలు.. తీవ్ర వాయుగుండంతో కురిసిన వర్షాలతో పుష్కలంగా నీరు నిలవడమే కాకుండా గట్ల మీదుగా పొర్లి బయటకు ప్రవహించింది. పలుచోట్ల చెరువుల్లో కూడా నీరు చేరింది. వరినారు అందుబాటులో వున్న రైతులు నాట్లు వేయడానికి పొలాలను దమ్ము చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఎక్కువచోట్ల వరి నారు అందుబాటులో లేకపోవడం, నాట్లు వేసే సమయం మించిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ఆలోచనలో వున్నారు.
మూడో రోజూ విద్యా సంస్థలకు సెలవు
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. అందవల్ల శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో వరుసగా మూడు రోజులపాటు పాఠశాలలు తెరుచుకోలేదు.