Share News

సమృద్ధిగా వంట గ్యాస్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:38 AM

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగారుల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతున్నది.

సమృద్ధిగా వంట గ్యాస్‌

అన్ని ఏజెన్సీల వద్ద ఫుల్‌ స్టాక్‌

సామాజిక మాధ్యమాల్లో ఉదంతులతో వినియోగదారుల్లో గుబులు

రీఫిల్‌ బుకింగ్‌ కోసం హైరానా

పెరిగిన రోజువారీ బుకింగ్స్‌

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగారుల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతున్నది. గృహ వినియోగ సిలిండర్లకు కొరత లేదని జిల్లా యంత్రాంగం పదేపదే చెబుతున్నప్పటికీ వినియోగదారులు కుదుటపడంలేదు సరికదా రీఫిల్‌ బుకింగ్స్‌ క్రమేపీ పెరుగుతూనే వున్నాయి. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు జిల్లాలో ప్రతి రోజు సగటున 18,184 సిలిండర్లు బుక్‌ అవుతుంటాయి. అన్ని గ్యాస్‌ ఏజెన్సీల వద్ద ఆదివారంనాటికి 37,920 సిలిండర్ల స్టాకు ఉంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల కారణంగా వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. రోజువారీ బుకింగ్స్‌ పెరగడంతో ముందుగా బుక్‌ చేసుకున్న వారికి తొలుత సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. సాధారణంగా బుకింగ్‌ చేసుకున్న రెండు, మూడు తరువాత ఇంటికి సిలిండర్‌ సరఫరా అవుతుంది. ప్రస్తుతం పెరిగిన బుకింగ్స్‌ ప్రభావంతో సిలిండర్‌ డెలివరీకి మరికొంత సమయంపడుతున్నది. ఈ విషయం తెలియక, ఇప్పటికే సిలిండర్‌ బుక్‌ చేసిన వారు ఆందోళన చెంది గ్యాస్‌ బాయ్‌ నుంచి కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ వరకు పలువురికి ఫోన్లు చేస్తున్నారు. మరోవైపు గ్యాస్‌ వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో రోజూ రెండుసార్లు ఆయిల్‌ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి అన్నారు. జిల్లాలో గృహ అవసరాల సిలిండర్లకు కొరత లేదని, అన్ని గ్యాస్‌ ఏజెన్సీల వద్ద తగినంత స్టాకు వుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అన్ని ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్ల స్టాకు, పెండింగ్‌ బుకింగ్స్‌ వివరాలను డిస్‌ప్లే బోర్డులో ఉంచాలని ఆదేశించారు.


వంటనూనెలపై యుద్ధ ప్రభావం

లీటరు ప్యాకెట్‌పై రూ.3 నుంచి రూ.5 పెంపు

పెరిగిన డ్రైఫ్రూట్స్‌ ధరలు

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం సెగలు అన్ని రంగాలను తాకుతున్నాయి. ఆయిల్‌ కంపెనీలు ఇప్పటికే వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.60 పెంచాయి. వంట నూనెల దిగుమతి మార్గంలో యుద్ధ ప్రభావం లేనప్పటికీ ఇక్కడ వ్యాపారులు మాత్రం వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు. లీటరు నూనె ప్యాకెట్‌పై రూ.3 నుంచి రూ.5 వరకు పెంచారు. కొన్ని కంపెనీలు మూడు నుంచి నాలుగు రూపాయలు, మరికొన్ని కంపెనీలు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు పెంచాయి. యుద్ధం కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వంట నూనెలు (ముడిచమురు) ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, ఉక్రేయిన్‌, కోస్టారికా నుంచి దిగుమతి అవుతుంటాయి. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, వంట నూనెలు దిగుమతి చేసుకునే తూర్పు ఆసియా(ఇండోనేషియా, మలేషియా)తో సంబంధం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరగలేదని, వీటికి కొరత కూడా లేదని, కానీ యుద్ధం సాకుతో కంపెనీలు వంటనూనెల ధరలు పెంచాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ ధరలను వ్యాపారులు పెంచేశారు. వాస్తవంగా యుద్ధం మొదలు కాకముందు దిగుమతి చేసుకున్నవి. కానీ యుద్ధం సాకుగా చూపి వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై పౌరసరఫరాల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 01:38 AM