ససేమిరా.!
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:02 AM
విద్యార్థులతో కళాశాలల యాజమాన్యాలు ఆడుకుంటున్నాయి.
విద్యార్థులతో కళాశాలల యాజమాన్యాల ఆటలు
రీయింబర్స్‌మెంట్ ఆలస్యంతో ఫీజులు వసూలు
ప్రభుత్వం నిధులు విడుదల చేసినా తిరిగి చెల్లించని వైనం
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థులతో కళాశాలల యాజమాన్యాలు ఆడుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయంటూ ముక్కుపిండి మరీ వారి నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తరువాత తిరిగి ఇచ్చేస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కుతున్నాయి. దీంతో జిల్లాలోని విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు ముందుగానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులను చెల్లించారు. కాగా ఇటీవల ప్రభుత్వం దశలవారీగా పెండింగ్ బకాయిలను విడుదల చేస్తోంది. గత ఏడాది ఫీజుల్లో ఒక క్వార్టర్ (కొన్ని కాలేజీలకు రెండు క్వార్టర్స్) మినహా నిధులు విడుదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియనీయకుండా యాజమాన్యాలు దోబూచులాడుతున్నాయి. తెలిసిన విద్యార్థులు డబ్బులు తిరిగివ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు నిర్ల్యక్షంగా సమాధానాలిస్తున్నాయి. కొద్ది కాలేజీలు మాత్రమే విద్యార్థులకు డబ్బు వాపస్ చేశాయి. ఈ ఏడాది ఫీజులు చెల్లించాల్సి ఉందని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులు జమైతే వెనక్కి ఇస్తామని మిగిలిన యాజమాన్యాలు మొండికేస్తున్నాయి.
ఎవరికి చెప్పాలో తెలియక..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరిగితే విద్యార్థుల పై ఒత్తిడి తెచ్చి మరీ డబ్బు కట్టించుకున్న యాజమా న్యాలు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమ వుతున్నారు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది మదనపడుతున్నారు. బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖకు చెందిన అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇదిలా, ఉండగా కళాశాలల యాజమాన్యాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. గత ఏడాది రెండు క్వార్టర్స్ ఫీజులు బకాయిలున్నాయని, ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు విడుదలైతే విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని చెబుతున్నాయి.