Share News

పెన్షన్‌ డబ్బుతో పరార్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 01:07 AM

లబ్ధిదారులకు అందించాల్సిన పెన్షన్‌ డబ్బుతో సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ పరారయ్యాడు. పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. వివరాలిలా ఉన్నాయి...

పెన్షన్‌ డబ్బుతో పరార్‌
ఇండిగిబిల్లి దేవుడు బాబు

సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ నిర్వాకం

రూ.3 లక్షలకు గాను రూ.83 వేలు పంపిణీ

మిగిలిన డబ్బుతో కనిపించకుండా పోయిన వైనం

పింఛనుదారుల ఆందోళనతో వెలుగులోకి

మల్కాపురం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):

లబ్ధిదారులకు అందించాల్సిన పెన్షన్‌ డబ్బుతో సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ పరారయ్యాడు. పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. వివరాలిలా ఉన్నాయి...

సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన ఇండిగిబిల్లి దేవుడు బాబు మల్కాపురం జనతాకాలనీ సచివాలయ వెల్ఫేర్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్‌ బట్వాడా చేసేందుకు వీలుగా ముందురోజే అతడికి సచివాలయం అడ్మిన్‌ రూ.3 లక్షలు అందజేశారు. కాగా దేవుడు బాబు ఒకటో తేదీన రూ.83 వేలను మాత్రం పెన్షన్‌లు అందించి, మిగిలిన రూ.2.17 లక్షలతో పరారయ్యాడు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు. కాగా నాలుగోతేదీ వచ్చినా పెన్షన్‌ డబ్బు చేతికి అందకపోవడంతో లబ్ధిదారులు సచివాలయం అడ్మిన్‌ను కలిసి సమస్యను వివరించారు. దీంతో వివరాలు తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ అప్పలనాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సచివాలయ ఉన్నతాధికారుల సూచన మేరకు సచివాలయంలో పెన్షన్లు పంపిణీ చేయగా మిగిలిన డబ్బును శనివారం లబ్ధిదారులకు సర్దుబాటు చేశారు. కాగా డబ్బుతో పరారైన వెల్ఫేర్‌ సెక్రటరీ దేవుడుబాబుకు మద్యం అలవాటు ఉందని, పెన్షన్‌లు బట్వాడా చేసిన రోజు కూడా పూటుగా మద్యం సేవించి వచ్చాడని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బు తీసుకుని పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 01:07 AM