విశాఖ కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:26 AM
విశాఖపట్నం కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ కాకినాడ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
హరేంధిరప్రసాద్‌కు కాకినాడ బదిలీ
కీలక ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ కాకినాడ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీఐఐసీ ఎండీ ఎం.అభిషిక్త్ కిశోర్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఏపీ కేడర్‌కు చెందిన అభిషిక్త్ కిశోర్ నెల్లూరుకు చెందిన వారు. ముస్సోరీలో శిక్షణ ముగిసిన తరువాత పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ట్రైనింగ్ పూర్తిచేశారు. ఆ తరువాత చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా, ఏటపాక సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సేవలందించారు. జిల్లాల విభజన నేపథ్యంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2024 జనవరిలో అన్నమయ్య కలెక్టర్‌గా ఆరు నెలలు పనిచేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జూలైలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఏపీఐఐసీ ఎండీగా పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం విశాఖ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
చిన్న వయసులోనే ఐఏఎస్
అభిషిక్త్ కిశోర్ 1992 సెప్టెంబరు 3 జన్మించారు. తండ్రి ఎంబీవీ కిశోర్ ఆంధ్రాబ్యాంకు అధికారి. తల్లి జయభారతి ఏపీ సాంఘిక గురుకులాల అధికారిగా పనిచేశారు. చెన్నైఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన కిశోర్ సాంకేతిక విద్యాశాఖ అనుమతితో 19 ఏళ్లకే ఇంజనీరింగ్ పూర్తిచేశారు. మూడేళ్లు ఎస్‌ఆర్‌ఎం, ఒక సంవత్సరం అమెరికాలో చదివిన తరువాత ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. ఆ తరువాత సివిల్స్‌లో 166వ ర్యాంకు సాధించారు.
కీలక ప్రాజెక్టుల్లో హరేంధిరప్రసాద్ పాత్ర
కాకినాడకు బదిలీ అయిన ఎంఎన్.హరేంధిరప్రసాద్ 2024 జూలై మూడో తేదీన విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ఐటీ, పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం, అవసరమైన భూముల కేటాయింపులో కీలకంగా వ్యవహారించారు. తర్లువాడలో గూగుల్ కంపెనీకి భూముల అప్పగింతలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రైతులను ఒప్పించారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, సిఫీ, తదితర ఐటీ కంపెనీలకు భూముల కేటాయింపులో ఇబ్బందులను అధిగమించారు. గత ఏడాది జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం, అనంతరం పెట్టుబడిదారుల సదస్సు, ఈ ఏడాది ఐఎఫ్‌ఆర్‌ను సమర్థంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు.
ఎంతో సంతృప్తి
విశాఖలో 20 నెలలకుగా కలెక్టర్‌గా పనిచేశాను. ఇక్కడ ఉద్యోగం సంతృప్తినిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించాం. ఐటీ కంపెనీలకు భూములు కేటాయించి, కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నా. విశాఖ ప్రజలు మంచి స్వభావం కలిగినవారు. ఈ నగరంలో పనిచేయడం మధురానుభూతి. అయితే కాలుష్య నివారణ, తదితర కొన్ని అంశాల్లో పురోగతి సాధించలేదన్నదే లోటు.
- ఎంఎన్ హరేంధిరప్రసాద్