ఆదివాసీలకు ఆధార్ కష్టాలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:13 AM
ఆధార్ కార్డుల ఆధారంగానే ఎటువంటి ప్రభుత్వ పథకమైనా, బ్యాంకు ఖాతాలు, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అటువంటి ఆధార్ కార్డులు సైతం పూర్తిగా లేని, ఉంటే సక్రమంగా లేని ఆదివాసీలు జిల్లాలో లక్ష మంది వరకు ఉంటారనేది ఒక అంచనా.
32 వేల మంది అంగన్‌వాడీ బాలలు, 6 వేల మంది పాఠశాల విద్యార్థుల ఆధార్ కార్డులు అస్తవ్యస్తం
ఎటువంటి ధ్రువీకరణ లేని 7 వేల మంది గిరిజనులు
ప్రభుత్వ శాఖల సమన్వయ లోపమే కారణం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఆధార్ కార్డుల ఆధారంగానే ఎటువంటి ప్రభుత్వ పథకమైనా, బ్యాంకు ఖాతాలు, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అటువంటి ఆధార్ కార్డులు సైతం పూర్తిగా లేని, ఉంటే సక్రమంగా లేని ఆదివాసీలు జిల్లాలో లక్ష మంది వరకు ఉంటారనేది ఒక అంచనా. అయితే ఆధార్ కార్డుల జారీ, నవీకరణ ప్రక్రియల్లో వివిధ శాఖల సమన్వయ లోపం వల్లే ఈ దుస్థితి కొనసాగుతున్నదని బాధితులు అంటున్నారు. మనిషి జననం నుంచి మరణం వరకు ఉండాల్సిన ఆధార్ కార్డులు మన్యంలో మాత్రం అందని ద్రాక్షలా, తప్పుల తడకగా ఉండడంతో ఆదివాసీలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రం/పాఠశాలల్లో చేరే బాలలకే ఆధార్ సమస్యలు అధికంగా ఉన్నాయి. వారందరికీ ఆధార్ కార్డులున్నప్పటికీ అవి సక్రమంగా లేని కారణంగా ప్రభుత్వ పరమైన ప్రోత్సాహకాలు, ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని బాలలకు సంబంధించి ఆధార్ కార్డులు అప్‌డేట్ కానప్పటికీ, వారికి ఏదో విధంగా పోషకాహారం అందిస్తున్నారు. వాస్తవానికి వారందరి ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో నేటికీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని బాలలకు సంబంధించి పోషణ్ ట్రాకర్‌లో సుమారు 80 వేల మంది బాలలకు గాను నేటికీ 32,949 మంది ఆధార్ కార్డులు అప్‌డేట్ కాని పరిస్థితి ఉంది. అందులో 0 నుంచి 6 నెలలున్న 3,940 మంది, 6 నెలల నుంచి 3 ఏళ్లున్న 10,600 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల బాలలు 19,409 మంది ఉన్నారు. వారికి సంబంధించిన పలు అధికారిక వ్యవహారాలు సాగించినప్పుడు ఆధార్ సక్రమంగా లేదని తిరస్కరించే అవకాశం ఉందని బాలల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అలాగే పాఠశాలల్లోని విద్యార్థులదీ ఇదే సమస్య. జిల్లాలో మొత్తం 2,079 పాఠశాలలకు గాను 182 పాఠశాలల్లోని విద్యార్థుల ఆధార్ కార్డులు అప్‌డేట్ చేయాల్సి ఉంది. ఇలా జిల్లాలోని మొత్తం 6,132 మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డులు తప్పులతడకగా ఉన్నాయి. దీంతో పోషకాహారం, ప్లే కిట్‌లు, విద్యా కానుకలు, తల్లికి వందనం ప్రోత్సాహం, పాఠశాల మారితే బదిలీ ధ్రువీకరణకు సైతం సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఆధారాలు లేక ఆధార్ పొందని దుస్థితి
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని వేలాది మంది ఆదివాసీలకు జనన, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేని పరిస్థితి సర్వసాధారణం. ఈ తరుణంలో వాళ్లు ఆధార్ కార్డులు పొందాలంటే చాలా కష్టంగా మారింది. వాస్తవానికి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని వారిని గుర్తించి, వారి నివాసం, తదితరులు నిర్థారించి, వారికి ఆధార్ కార్డులు జారీ చేసేందుకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయమని ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అయితే వారికి పని ఒత్తిడి, ఇతర కారణాలతో ఆశించిన స్థాయిలో వీఆర్‌వోలు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేకపోతున్నారు. ఈ సమస్యతో జిల్లాలో నేటికీ 7 వేల మంది ఆధార్ కార్డులు పొందని పరిస్థితి ఉంది. కాగా మారుమూల ప్రాంతాలకు చెందిన ఆదివాసీల్లో కొందరికి ఆధార్ కార్డులు లేకుంటే, మరికొందరికి అవి సక్రమంగా లేని పరిస్థితి ఉంది. అలాగే మారుమూల ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు గెడ్డలు, వాగులు దాటుకుంటూ, పదుల కిలోమీటర్లు నడుచుకుంటూ మండల కేంద్రాలు వచ్చి ఆధార్ కార్డుల్లోని సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
సమన్వయంతోనే ఆధార్ సమస్యలకు పరిష్కారం
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ప్రస్తుతం నెలకొన్న ఆధార్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. ఆధార్ కార్డులు సక్రమంగా లేని కారణంగా అనేక మంది గిరిజనులు వివిధ ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోని రెవెన్యూ, విద్య, వైద్యం, అంగన్‌వాడీ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగులు సమన్వయంతోనే ఆధార్‌లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాగే జిల్లాలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో విరివిగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను సకాలంలో తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.