ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:25 PM
జిల్లాలోని ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ అన్నారు.
జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ
ఆదివారం కూడా అందుబాటులో..
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ అన్నారు. జిల్లా కేంద్రం శివారున నక్కలపుట్టులో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఆధార్ సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీపూజ మాట్లాడుతూ గతంలో ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఆధార్ సేవా కేంద్రాలుండేవని, కాని ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లాలో ఇది తొలి ఆధార్ సేవా కేంద్రమని, జిల్లా ప్రజలకు ఆధార్ సేవలు మరింత దగ్గరయ్యాయన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో కొత్త ఆధార్ కార్డుల నమోదుతో పాటు మార్పులు, చేర్పులు మరింత సులభతరమవుతాయన్నారు. ఆధార్ సమస్యలను ప్రజలు పరిష్కరించుకునేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ కౌంటర్ సైతం ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, తదితరుల సౌకర్యార్థం ఆదివారం సైతం ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని జేసీ శ్రీపూజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఐడీఏఐ రీజనల్ కార్యాలయం(హైదరాబాద్) డిప్యూటీ డైరెక్టర్ ఎన్‌జీ.కృపానందం, రీజనల్ మేనేజర్ శ్రీనివాసకుమార్, స్థానిక ఆధార్ సెంటర్ జిల్లా మేనేజర్ ఓలుగు నాగరాజు, సిబ్బంది జి.ఆనంద్, డీకే కుమార్, జి.అనిల్‌కుమార్, ఎన్.సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.